Case Against Book My Show For Selling Sunburn Tickets in Hyderabad : భారీ సంగీత వేడుకగా పేరుగాంచిన కార్యక్రమం సన్‌బర్న్. న్యూ ఇయర్ వచ్చిందంటే దేశవ్యాప్తంగా ఈ వేడుకలో పాల్గొంటారు. అయితే హైదరాబాద్‌లో ఈ ఈవెంట్‌కు అనుమతులు రాకుండా బుక్ మై షో టికెట్లు విక్రయిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. దీంతో పోలీసులు బుక్‌మై షో నిర్వాహకులపై ఛీటింగ్ కేసు నమోదు చేశారు. రాష్ట్రంలో నిబంధనలను పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. న్యూ ఇయర్ ఈవెంట్ల కోసం పోలీసుల అనుమతి తప్పని సరిగా ఉండాలని గుర్తు చేశారు. ఇలాంటి కార్యక్రమాల్లో అసాంఘిక కార్యకలాపాలు కొనసాగిస్తే క్రిమినల్ కేసులు తప్పవని వెల్లడించారు.
సన్‌బర్న్ అనేది భారీ సంగీత వేడుక. దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఈవెంట్లు నిర్వహిస్తుంటారు. ఈ వేడుకలో మద్యం అనుమతి ఉంటుంది. ఇదే అదనుగా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతాయనే ఆరోపణలున్నాయి. ఈసారి నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా డిసెంబరు 31వ తేదీన మాదాపూర్‌లో సన్‌బర్న్ పేరుతో ఈవెంట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Hyderabad Sunburn Event Controversy 2023 : వాస్తవానికి ఈ వేడుకను సుమంత్ అనే వ్యక్తి నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈవెంట్‌ను సన్‌బర్న్ పేరుతో నిర్వహిస్తామని, ఇందుకు కొంత మేర చెల్లిస్తానని అతడు నిర్వాహకులతో ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది. ఈవెంట్ నిర్వహణకు అనుమతి కోసం పోలీసులకు దరఖాస్తు చేసినా ఇంకా ఆమోదం లభించలేదు. అయినా బుక్‌మై షోలో టిక్కెట్లు అమ్మకానికి పెట్టడంతో అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈవెంట్‌కు ఎలా అనుమతి ఇస్తారంటూ సీఎం రేవంత్ పోలీసుల్ని ప్రశ్నించారు.
CP Avinash Mohanty On Sun Burn Event : మరోవైపు దీనిపై సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి (Avinash Mohanty) స్పందించారు. ఈవెంట్ నిర్వహణకు దరఖాస్తు చేసుకున్నారని, అయితే అనుమతి ఇవ్వలేదని తెలిపారు. మాదాపూర్‌లోని హైటెక్‌సిటీ సమీపంలో ఈ ఈవెంట్ ఏర్పాటు చేసేందుకు నిర్వాహకులు సిద్ధమైనట్లు పేర్కొన్నారు. ఇది ఇతర నగరాల్లో జరిగే సన్‌బర్న్‌లాంటి వేడుక కాదని, అందుకే అనుమతి నిరాకరించామని మహంతి స్పష్టం చేశారు.
సన్‌బర్న్ ఈవెంట్ అడ్డగింతకు ఎన్‌ఎస్‌యూఐ యత్నం.. అడ్డుకున్న పోలీసులు..
సన్‌బర్న్‌లో యువకుడి అనుమానాస్పద మృతి : గతంలో శంషాబాద్‌లో నిర్వహించినప్పుడు వేడుకలో పాల్గొన్న యువకుడు అనుమానాస్పద రీతిలో మరణించాడు. తన సోదరుడి మరణానికి వేరే కారణముందని, ముఖంపై గాయాలున్నాయని, చెవుల నుంచి రక్తం వచ్చిందని, కేసును తప్పుదోవ పట్టించారని మృతుడి సోదరుడు అప్పట్లో ఆరోపించారు. 2017లో గచ్చిబౌలిలో నిర్వహించినప్పుడు కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ముందు ధర్నాకు దిగారు. గతేడాది శంషాబాద్‌లో నిర్వహిస్తున్న సమయంలోనూ యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ నేతలు నిరసన తెలిపారు. సన్‌బర్న్ వేడుకలో డ్రగ్స్ విచ్చలవిడిగా విక్రయిస్తారని, ఇది అనేక నేరాలకు దారి తీస్తుందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.
ఆ తర్వాత ఇతర రాష్ట్రాల్లో నిర్వహించినప్పుడూ ఈ వేడుకను వివాదాలు చుట్టుముట్టాయి. 2020లో గోవాలో నిర్వహించినప్పుడు తీవ్ర నిరసన నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం రద్దు చేసింది. అనేక ఆరోపణలు చుట్టుముట్టిన సన్‌బర్న్ ఇప్పుడు హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నట్లు టిక్కెట్లు విక్రయించడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రిసార్టుల్లో రేవ్ పార్టీలు... మత్తులో చీకటి సయ్యాటలు
హైదరాబాద్‌తో పాటు దేశంలోని పలు నగరాల్లో జరిగే సన్‌బర్న్ ఈవెంట్ మరోసారి చర్చనీయాశంగా మారింది. ఆదివారం జరిగిన కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దీనిపై ప్రత్యేకంగా ఆరా తీశారు. ఆన్‌లైన్‌లో టికెట్లు విక్రయిస్తున్నట్లు తెలిసిందని, అనుమతులు ఎలా ఇచ్చారని పోలీసు అధికారులను ఆయన ఆరా తీశారు. సమావేశం అనంతరం సైబరాబాద్ పోలీస్ ఉన్నతాధికారులు ఈవెంట్ నిర్వాహకుల్ని, బుక్‌మై షో ప్రతినిధుల్ని పిలిపించుకుని గట్టిగా మందలించారు. పోలీసులు అనుమతివ్వకుండానే ఆన్‌లైన్‌లో టికెట్లు ఎలా విక్రయిస్తారని ప్రశ్నించినట్లు తెలిసింది. హద్దు మీరితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు సమాచారం.