ఆత్మహత్య చేసుకోవటానికి దారి తీస్తున్న కారణాలపైనా ప్రపంచ వ్యాప్తంగా నిపుణులు సాగించిన పరిశోధనలో చాలా విషయాలు బయటపడ్డాయి. ఆర్థిక, సామాజిక, మానసికపరమైన సమస్యలే ప్రధానంగా కనిపిస్తున్నాయి. పొట్టి, పొడవు, నలుపు, ఊబకాయం ఇలా... శారీరక సంబంధమైన విషయాలపై కలత చెందుతూ ఆత్మహత్యలకు పాల్పడే వారిని ఓ వర్గంగా విశ్లేషిస్తున్నారు వైద్యులు. ఆర్థిక పరిస్థితులు, రుణ భారాలకు తాళలేక అప్పుల ఊబిలో కూరుకుపోయి భవిష్యత్‌పై భయంతో ప్రాణాలొదులుతున్న వారిని మరో వర్గంగా విభజించారు. కరోనా మహమ్మారి కారణంగా... ప్రాణ భయంతో, ఆర్థిక కష్టాలతో ఎంతో మంది ఆత్మహత్యలకు పాల్పడటాన్ని ఇందుకు ఉదాహరణగా చూడొచ్చు.
ప్రేమలో విఫలం, ఫలానా పని చేయటం పరువు పోయిందని భావించటం.. లాంటి కారణాలతో ఆత్మహత్యల ఆలోచనలు పెరుగుతున్నాయి. ఇలా నిత్యం కుంగుబాటుకు గురైన సమయంలో వారిని తల్లిదండ్రులు, సన్నిహితులు గుర్తించటం లేదు. ఫలితంగా.. ఎంతో మంది విలువైన ప్రాణాలను వదిలేసుకుంటున్నారు. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన ఉన్నవారిని సన్నిహితంగా ఉండే వారు గమనించవచ్చని మానసిక వైద్యులు చెబుతున్నారు. చనిపోవాలనే ఆలోచన ఉన్నవారి వైఖరి, మాట్లాడుతున్న విధానం ఇలా ఎన్నో విషయాలు ఈ లక్షణాలను బయటపెడతాయంటున్నారు. అతిగా మాట్లాడటం అలవాటున్న వారు ఒక్కసారిగా స్తబ్దుగా మారిపోతుంటారు. ఎక్కువగా ఒంటరిగా గడపటానికి ఇష్టపడుతుంటారు. తమలో తామే మాట్లాడుకోవటం, సమయానికి ఆహారం తీసుకోకపోవటం, ఎక్కువ సేపు నిద్రపోవటం ఇలా ఎన్నో లక్షణాలను వారిలోని కుంగుబాటును తెలియజేస్తాయని చెబుతున్నారు.
నిరాశ, నిస్సహాయత, తనమీద తనకు నమ్మకం లేకపోవడం బలవన్మరణాలకు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. కొన్నిసార్లు క్షణికావేశం, బెదిరింపు ధోరణిలో చేస్తున్న ప్రయత్నాలు ఆత్మహత్యలుగా మారుతున్నాయి. ప్రతి చిన్న విషయానికీ కంట తడిపెట్టుకోవడం ఏకాగ్రత లోపించటం లాంటివి ఆత్మహత్య లక్షణాలుగా చెబుతున్నారు. ఒక వ్యక్తి సమస్యలతో
బాధపడుతున్నట్లు గుర్తించినప్పుడు వారితో చర్చించడం మంచిది. తద్వారా వారిలో ఇటువంటి ఆలోచనలు ఉంటే బయపడటానికి అవకాశం ఉంది. తన సమస్యను ఎవరో ఒకరు గుర్తించారనే సాంత్వన కలుగుతుంది. అనేక మానసిక సమస్యలూ ఆత్మహత్యకు దారి తీస్తాయి. ఆత్మహత్య ఆలోచనలున్న వారిని ముందుగానే గుర్తించి మాట్లాడే ప్రయత్నం చేస్తే... దాదాపు 90% మేర బలవన్మరణాలను నివారించవచ్చన్నది మానసిక నిపుణుల అభిప్రాయం. అప్పటికీ వారిలో మార్పు కనిపించకపోతే... వైద్యులను సంప్రదించి సరైన కౌన్సిలింగ్ ఇవ్వటం ద్వారా సమస్య నుంచి బయటపడొచ్చని చెబుతున్నారు.
మానసిక కుంగుబాటు, ఆందోళన, స్కిజోఫ్రీనియా లాంటి అనేక సమస్యలవల్ల ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. మానసిక ఆరోగ్యం, సమస్యలపట్ల నిర్లక్ష్య ధోరణి, సరైన పరిజ్ఞానం లేకపోవడమూ ఆత్మహత్యలకు మరో కారణంగా చెప్పవచ్చు. ఒత్తిడిని తట్టుకో లేకపోవడం, పరిస్థితులకనుగుణంగా మలచుకోలేకపోవడం, భవిష్యత్తు కన్నా గతంపైనే ఆలోచనలు ఎక్కువగా ఉండటం, ఆత్మన్యూనతాభావం, ఈ సమస్యకు దారితీస్తున్న ప్రధాన కారణాలు. ఎవరిలోనైనా ఆత్మహత్య లక్షణాలు ఉన్నట్లు భావిస్తే వారిని ఒంటరిగా వదలకూడదు. తోచిన సలహాలు ఇవ్వడంతోపాటు సాయం చేయడంవల్ల నిస్సహాయ స్థితినుంచి వారిని బయట పడేయాలి. భవిష్యత్తు ప్రణాళికలు చర్చిస్తూ ఇలాంటివారిలో ఆశావాదాన్ని కలిగించాలి.
గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఒకరినొకరు ప్రేమగా పలకరించుకునేవారు. అన్ని విషయాలు తల్లిదండ్రులతో పంచుకునే సమయం, స్వేచ్ఛ ఉండేది. ప్రస్తుతం మార్కులు, ర్యాంకులు అంటూ పోటీ ప్రపంచంలో పరుగు పెడుతున్నారు. చాలా మంది తల్లిదండ్రులకు తమ పిల్లలతో ప్రేమగా మాట్లాడే సమయం దొరకడం లేదు. ఉమ్మడి కుటుంబాలు కనుమరుగయ్యాయి. ఈ కారణంగా మానవ సంబంధాలు ఛిన్నాభిన్నం అవుతున్నాయి. చాలా మంది తమ బాధను పంచుకోలేక మనసులోనే అంతర్యుద్ధం చేసి చివరికి ఆత్మహత్యే శరణ్యం అనే నిర్ణయానికి వస్తున్నారు. వారి జ్ఞాపకాలతో బతికున్న వారు కుమిలిపోతున్నారు. ప్రధానంగా ఇంటి పెద్ద, ఎదిగి వచ్చిన కొడుకు చనిపోతే ఆ కుటుంబం రోడ్డున పడుతుంది.
సాంకేతికత పెరుగుతుండటం వల్ల వ్యక్తుల జీవన విధానంలోనూ అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ట్విట్టర్, ఫేస్‌బుక్, యూట్యూబ్, వాట్సప్ తదితర సామాజిక మాధ్యమాల్లోనే ఎక్కువ సమయం గడిపేస్తున్నారు. ఎంతమందిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా స్మార్ట్ ఫోన్లతోనే కాలక్షేపం చేస్తున్నారు. ఇతర వ్యక్తులతో కలవడం పక్కనపెడితే, కనీసం ఆత్మీయంగానైనా పలకరించని పరిస్థితి. వాస్తవిక జీవితానికి దూరంగా, అద్దపు తెరలే లోకంగా జీవిస్తున్న దుస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఊహించని విధంగా చిన్న సమస్య తలెత్తినా ఎవరితో పంచుకోవాలో తెలియక ఆందోళన చెందుతూ ఆత్మహత్యల వైపు చూస్తున్నవారూ ఉన్నారు.
ఈ మానసిక జాడ్యాన్ని దూరం చేయటంలో ప్రభుత్వాలు సైతం కీలకపాత్ర పోషించాల్సి ఉంది. 130 కోట్ల దేశ జనాభాకు సరిపడిన స్థాయిలో మానసిక వైద్యనిపుణులు లేకపోవటం దురదృష్టకరం. జాతీయ స్థాయి మానసిక వైద్యవిద్యా సంస్థలను మరింతగా పెంచాల్సిన అవసరం ఉంది. వాటి సేవలను మారుమూల గ్రామాలకు విస్తరించాల్సి ఉంది. పాఠశాల విద్యాభ్యాసం నుంచే మానసిక సమస్యలపై స్పందించాల్సిన తీరు.. ఒత్తిడికి దూరంగా ఉండాల్సిన అవసరంపై అటు తల్లితండ్రులు, ఇటు విద్యాలయాలు దృష్టి సారించాలి. ప్రాణం అన్నింటికంటే విలువైంది. చిన్న చిన్న సమస్యలకు భయపడి జీవితాన్ని ముగించటం సరికాదు. పోరాటమే సగం విజయం అన్న సూత్రమే ఆయుధంగా... కష్టాలను ఎదిరిస్తే ఈ సమస్యకు పరిష్కారం లభించినట్టే.
ఇదీ చదవండి: 'కష్టాలను అధిగమించకుండా ఆత్మహత్య చేసుకుంటున్నారు'