కాలువలు, వాగులపై నిర్మించిన వంతెనల గోడలు, రహదారులు సురక్షితంగా లేకపోవడంతో అవే కాలువలు మృత్యుప్రవాహాలవుతున్నాయి. కరీంనగర్ సమీపంలోని అలుగునూరు వద్ద కాకతీయ కాలువలో కారు మునిగి... పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సోదరి కుటుంబంలోని ముగ్గురు మృతి చెందిన విషయం 21 రోజులకు గానీ వెలుగులోకి రాలేదు. అదే రీతిలో నల్గొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలం వడ్డెరిగూడెం సమీపాన కాల్వలోకి కారు దూసుకుపోవడంతో దంపతులు, వారి కుమార్తె నీట మునిగి మృతి చెందారు.
శ్రీరామసాగర్, మధ్య, దిగువ మానేరు ప్రాజెక్టుల కాలువలు, కాకతీయ కాలువ, వరద కాలువ, జూరాల ప్రాజెక్టు, నెట్టెంపాడు ఎత్తిపోతలు, నాగార్జునసాగర్ ప్రాజెక్టు కాలువలతో పాటు పలు మధ్య తరహా ప్రాజెక్టుల కింద ఉన్న కాలువలపై వంతెనలు ప్రమాదకరంగా ఉన్నాయి. వీటిపై ‘ఈనాడు-ఈటీవీ భారత్’ క్షేత్రస్థాయిలో పరిశీలించగా, పలు సమస్యలు వెలుగులోకి వచ్చాయి.
రోడ్లు, వంతెనల నిర్మాణంలో లోపాలు, రక్షణ చర్యలు కొరవడడంతో వాహనాలు కాలువలు, వాగుల్లోకి దూసుకుపోతున్నాయి. ఇలాంటి ప్రమాదాలు రాష్ట్రంలో పెరుగుతూ వస్తున్నాయి. రోడ్లు, వంతెనలు వివిధ శాఖల ఆధ్వర్యంలో నిర్మితమవుతుంటాయి. వాటి స్థాయిని బట్టి పంచాయతీరాజ్, రహదారులు- భవనాలు, జాతీయ రహదారుల విభాగం వీటికి బాధ్యత వహిస్తాయి. నిర్మాణ ప్రమాణాలు (స్పెసిఫికేషన్స్) వేర్వేరుగా ఉంటాయి. ఈ శాఖలకు, కాలువలను పర్యవేక్షించే సాగునీటిశాఖకు తగిన సమన్వయం ఉండదు. ప్రమాదం జరిగినప్పుడు తాత్కాలిక ఏర్పాట్లు తప్ప, శాశ్వత రక్షణ చర్యలు కానరావు. వీటిపై ‘ఈనాడు-ఈటీవీ భారత్’ క్షేత్రస్థాయిలో పరిశీలించగా, వైఫల్యాలు వెలుగు చూశాయి.
- కరీంనగర్ శివారుల్లో జగిత్యాల వెళ్లే మార్గంలో రేకుర్తి వాగుపై రెండు వంతెనలు ఇరుకుగా ఉన్నాయి. ఒకవైపు రోడ్డు వెడల్పు కంటే తక్కువగా ఉన్న ఈ వంతెన ఇరుకుగా మారింది. ఇక్కడ గతంలో ఒక డీసీఎం వాహనం వాగులోకి దూసుకెళ్లింది. ఇటీవల తాత్కాలికంగా నిలువురాళ్లు పాతారు.
- జగిత్యాల మార్గంలోనే కొత్తపల్లి కాకతీయ కాలువలో 2002లో టెంపో వ్యాను పడి తొమ్మిది మంది ప్రాణాలు విడిచారు. వంతెనకు ఇరువైపులా తాత్కాలికంగా సన్నటి ఇనుప చువ్వలతో పెట్టిన ఈ కంచె వాహనాలను నిలువరించలేదు.
- ఏపీలోని మంత్రాలయం నుంచి గద్వాల వచ్చే వాహనాలు మల్దకల్ మండల శివారులోని ఈ వంతెన మీదుగా రావాల్సిందే. నెట్టెంపాడు ప్రధాన కాలువపై ఉన్న ఈ వంతెనకు ఇరువైపులా రెయిలింగ్ లేక ప్రమాదకరంగా మారింది.
- సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లోని నాగార్జునసాగర్ ప్రాజెక్టు కాలువల సమీపంలో మూల మలుపులున్న ప్రాంతాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. నడిగూడెం మండలం చాకిరాల వద్ద వాహనం మునిగిన ఘటన తరువాత రాళ్లుపాతి, బోర్డు పెట్టి వదిలేశారు.
- జగిత్యాల జిల్లా మల్యాల మండలం ధరూరు గ్రామ పంచాయతీలోని ప్రధాన రహదారిపై కాకతీయ ప్రధాన కాలువ ఇది. రోడ్డుకు సమాంతరంగా ఉన్న ఈ ప్రదేశంలో వంతెనపై రక్షణ గోడలు తక్కువ ఎత్తులో ఉన్నాయి.
ఇవీ లోపాలు... సరిదిద్దని అధికారులు
- దగ్గరికొచ్చే వరకూ అక్కడ కాలువ ఉందని తెలిపే బోర్డులు ఎక్కడా ఏర్పాటు చేయడం లేదు.
- ప్రధాన కాలువలు సమీపిస్తుండగానే వాహన చోదకులను అప్రమత్తం చేసేలా రోడ్లపై హెచ్చరికల ఏర్పాట్లు లేవు.
- ఇరుకైన కాలువలకు ముందుగానే రెండు వైపులా వేగ నిరోధకాల (స్పీడ్ బ్రేకర్లు) నిర్మాణమూ లేదు.
- చెరువులు, వంతెనలు సమీపిస్తుండగానే రైలు వేగం తగ్గించేలా రైల్వే శాఖలో అప్రమత్తం చేసే వ్యవస్థలు ఉంటాయి. రహదారులు, సాగునీటి కాలువల విషయంలోనూ ఇలాంటి ఏర్పాట్లు అవసరం.
- వంతెనపై వాహనం అదుపు తప్పినా కాలువలో పడిపోకుండా పిట్ట గోడలు ఎత్తుగా నిర్మించాల్సి ఉంది. చాలా చోట్ల అవి రెండు మీటర్ల కన్నా ఎత్తు లేవు.
- బ్యారికేడ్లు ఏర్పాటు చేయాల్సి ఉన్నా చాలా చోట్ల రాళ్లు పాతి వదిలేస్తున్నారు.
- రాళ్లు, సిమెంటు గోడలు కొంత వరకు వాహనాన్ని అడ్డుకుంటాయే గానీ, వాహన దిశను మార్చవు. సిమెంటు నిర్మాణాలను ఢీకొంటే... వాహనాలు పైకి లేచి కాలువలో పడిపోతున్నాయి.
- జాతీయ రహదారులకు ఇరువైపులా ఏర్పాటు చేసే లోహపు ప్లేట్లను కాలువల వద్ద వినియోగిస్తే వాహనం దూసుకొచ్చినా అవి వాటిని నిరోధించి దిశను మళ్లించేందుకు ఉపయోగపడతాయి.
ప్రమాదకర ప్రాంతాలెక్కడ?
తెలంగాణ రోడ్డు భద్రతా విభాగం అధ్యయనం
కరీంనగర్ సమీపంలోని అలుగునూరు వద్ద కొద్ది రోజుల కిందట కారు కాలువలోకి దూసుకుపోవడంతో ముగ్గురు సభ్యుల కుటుంబం జలసమాధి అయిన నేపథ్యంలో తెలంగాణ రోడ్ సేఫ్టీ అథారిటీ అప్రమత్తమైంది. రాష్ట్రంలోని జాతీయ, రాష్ట్ర రహదారుల్లో ప్రమాదకర ప్రాంతాలెక్కడున్నాయనే విషయంపై అధ్యయనం చేస్తోంది. ఈ మేరకు అథారిటీ ఛైర్మన్, డీజీ తెన్నేటి కృష్ణప్రసాద్ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు లేఖలు రాశారు. ముఖ్యంగా వంతెనలు, కాల్వలున్న ప్రాంతాలపై కీలకంగా దృష్టి పెట్టనున్నారు. వంతెనలు ఇరుకుగా ఉండటం, వాటి పిట్టగోడలు తక్కువ ఎత్తులోనో, బలహీనంగానో ఉండటం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోనున్నారు. ప్రమాదాలకు కారణాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో మరమ్మతు చర్యలకు ఉపక్రమించాలని అథారిటీ సూచించింది. ఇంజినీరింగ్ విభాగాలతో సమన్వయం చేసుకుంటూ సమగ్ర నివేదికలు రూపొందించాలని నిర్దేశించింది.
కాలువల నిర్మాణమే మా బాధ్యత
కాలువల నిర్మాణాలను మాత్రమే నీటిపారుదల శాఖ పర్యవేక్షిస్తుంది. వంతెనలు, ఇతర రక్షణ చర్యలను రహదారి నిర్మాణ సంస్థలే ఏర్పాటు చేసి పర్యవేక్షించాలి. పశువుల రాకపోకలకు వీలుగా వంతెనలపై ప్రత్యేకంగా నిర్మాణాలకు ప్రణాళికలు లేవు. దీనిపై మా ఉన్నతాధికారులకు సూచిస్తాం.
-శంకర్, సీఈ, ఎస్సారెస్పీ
నిర్మించిన శాఖలే పర్యవేక్షించుకోవాలి
రహదారులు, భవనాల శాఖలో 2014 తర్వాత నిర్మించే వంతెనల వద్ద అన్ని రక్షణ చర్యలు తీసుకుంటున్నాం. అంతకు ముందు నిర్మించిన పాత వంతెనల పరిస్థితినీ పర్యవేక్షణ చేస్తున్నాం. సమస్యలున్న చోట చర్యలు తీసుకుంటున్నాం. వంతెన నిర్మించిన శాఖనే దాని పర్యవేక్షణ బాధ్యత తీసుకోవాలి.
-రవీందర్ రావు, ఈఎన్‌సీ, ర.భ.శాఖ
మా నాన్న ప్రాణం పోయింది
ఇక్కడ కాలువపై వంతెన ఇరుకుగా ఉంది. పశువులను తోలుకుంటూ వస్తున్న మా నాన్నను ఏడాది క్రితం వాహనం ఢీకొనడంతో ప్రాణం పోయింది. ఇదే వంతెనపై నుంచి గత ఏడాది లారీ కూడా కాలువలో పడింది
- శంకర్, నూకపల్లి, కరీంనగర్ జిల్లా
ఇదీ చదవండి: నేటి నుంచి వెబ్సైట్లో ఇంటర్ హాల్టికెట్లు