వైద్యురాలి హత్యను నిరసిస్తూ రాజేంద్రనగర్ పీవీ నర్సింహారావు విశ్వవిద్యాలయం విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. మాసబ్ ట్యాంక్ పశువైద్య సంచాలకుల కార్యాలయం వరకు ఆ ర్యాలీ కొనసాగించారు. ఈ కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. సంచాలకుల కార్యాలయంలో వైద్యురాలి చిత్రపటానికి మంత్రి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని మంత్రితోపాటు పశుసంవర్థక శాఖ సంచాలకులు డాక్టర్ లక్ష్మారెడ్డి, అధికారులు, విద్యార్థులు, సిబ్బంది సామూహికంగా మౌనం పాటించారు.
విద్యార్థినులు, మహిళలు అప్రమత్తంగా ఉండాలన్నారు. 100 టోల్‌ఫ్రీ నంబరు సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని మంత్రి తలసాని సూచించారు. ఆ బాధిత కుటుంబానికి ధైర్యం ప్రసాదించాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్లు మంత్రి తలసాని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పశువైద్య విద్యార్థులు, పూర్వ విద్యార్థులైన వివిధ హోదాల్లో పనిచేస్తున్న ఉన్నతాధికారులు, అధ్యాపకులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : 'ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకతతోనే కేసీఆర్ దిగొచ్చారు'