రాష్ట్రంలో 2021-22 ఏడాదికి ఉపకారవేతనాలు, బోధన రుసుంల దరఖాస్తు ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. ఆదివారంతో గడువు ముగియనుండగా కనీసం 1.6 లక్షల మంది కూడా దరఖాస్తు చేసుకోలేకపోయారు. ఈ విద్యాసంవత్సరానికి 12.50 లక్షల మంది అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటారని అంచనా వేసినా ఆ మేరకు దరఖాస్తులు రాలేదు. గడువు తక్కువగా ఇవ్వడం, ప్రవేశాలు ఇంకా కొనసాగుతుండటంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. 2021-22 ఏడాదికి ఈనెల 24లోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఈ-పాస్ వెబ్సైట్లో ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం రెండు, మూడు, నాలుగో సంవత్సరం చదువుతున్న పునరుద్ధరణ (రెన్యువల్) విద్యార్థులు 7.97 లక్షల మంది ఉన్నట్లు సంక్షేమ శాఖలు అంచనా వేశాయి. కానీ 1.53 లక్షల మంది మాత్రమే దరఖాస్తు చేశారు. అలాగే కొత్తగా కోర్సుల్లో చేరిన విద్యార్థులు 5.5 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటారని భావించినా 7 వేల మంది ఆన్‌లైన్లో దరఖాస్తులు అందజేశారు.
ఆటో రెన్యువల్ లేకనే...
సాంకేతికత అందుబాటులో ఉన్నా విద్యార్థులు కాగితాలతో కుస్తీ పట్టాల్సి వస్తోంది. ఆన్‌లైన్లో ధ్రువీకరణ పత్రాలు అప్‌లోడ్ చేసి, ప్రింట్ తీసుకుని, విద్యార్హత పత్రాలు జతచేసి కళాశాలల్లో అందజేయాల్సి వస్తోంది. ఈ పరిస్థితి నివారించేందుకు పునరుద్ధరణ విద్యార్థుల దరఖాస్తులు వాటంతట అవే రెన్యువల్ అయ్యేలా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయాలని సంక్షేమశాఖలు భావించినా.. అది అమల్లోకి రాలేదు. కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశాలు పొందినవారి వివరాలు వెంటనే ఈ-పాస్ వెబ్‌సైట్‌తో అనుసంధానం అవుతున్నాయి. వారు ఆ వెబ్సైట్లో ఆధార్, పదో తరగతి హాల్‌టికెట్ నంబరు నమోదు చేసిన వెంటనే కళాశాల, కోర్సు, యూనివర్సిటీ పేరు వస్తున్నాయి. కుల, ఆదాయ ధ్రువీకరణ, ఆధార్ నమోదు చేస్తే దరఖాస్తు పూర్తయిపోతోంది. యూనివర్సిటీలు, బోర్డులు ఆ ఏడాదికి నిర్వహించిన పరీక్షలకు హాజరైన విద్యార్థుల సమాచారం కూడా ఇలాగే ఈ-పాస్‌తో అనుసంధానం చేయాలని సంక్షేమశాఖలు నిర్ణయించాయి. తద్వారా వారి దరఖాస్తులన్నీ వాటంతట అవే రెన్యువల్ అయ్యేలా చేయాలని భావించినా పూర్తికాలేదు. ఈ ఆటో రెన్యువల్ విధానం అమల్లోకి వస్తే విద్యార్థులపై దరఖాస్తు ఆర్థిక భారం తగ్గనుంది.
ఇదీ చదవండి: Bathukamma on Burj Khalifa: విశ్వవ్యాప్తమైన బతుకమ్మ పూలసంబురం.. బుర్జ్ ఖలీఫాపై తెలంగాణం