రాష్ట్రంలో విద్యార్థులకు చెందిన ఆధార్ అప్‌డేట్ కార్యక్రమాన్ని పాఠశాలల ద్వారా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 5 నుంచి 15 ఏళ్ల మధ్య వయసున్న విద్యార్థులకు చెందిన ఆధార్ సమాచారాన్ని అప్‌డేట్ చేసేందుకు 1,344 కిట్లు సిద్ధం చేసినట్లు యూఐడీఏఐ అధికారులు తెలిపారు.
ఆధార్ కిట్ల పంపిణీ
నెలల నిండిన చిన్నారులకు కూడా ఆధార్ కార్డులను జారీ చేస్తుండగా ఐదేళ్లు నిండిన తరువాత ఒకసారి, 15 ఏళ్ల తర్వాత మరోసారి వేలిముద్రలను అప్‌డేట్ చేసే ప్రక్రియ కొనసాగుతుంది. విద్యాశాఖ ద్వారా విద్యార్థుల ఆధార్ అప్‌డేట్ చేసేందుకు వీలుగా అందుబాటులోకి వచ్చిన 1,344 కిట్లను పాఠశాలల వారీగా పంపిణీ చేయనున్నారు.
ఉచిత సేవలు
ఈ కిట్ల ద్వారా విద్యార్థుల ఆధార్ అప్‌డేట్ చేసే కార్యక్రమంతోపాటు ఇప్పటి వరకు ఆధార్ తీసుకోని విద్యార్థులకు కొత్తగా ఆధార్ కార్డులు జారీ చేస్తారు. తొలిసారిగా ఆధార్ నమోదు చేసుకునే విద్యార్థుల దరఖాస్తులపై తల్లిదండ్రుల సంతకాలు అనివార్యమని అధికారులు తెలిపారు. ఆధార్ కార్డులో మార్పులు చేర్పులు చేసుకునేందుకు కూడా వెసులుబాటు కల్పించారు. తొలిసారి వివరాలు నమోదు చేసుకునే విద్యార్థులకు ఉచితంగానే సేవలు అందిస్తామని అధికారులు వెల్లడించారు.
నిధుల కోసం నివేదిక
విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఎన్ని కిట్స్ అవసరమన్నది అధికారులు ప్రతిపాదనలను రూపొందించనున్నారు. అందుకు అవసరమైన నిధుల కోసం కేంద్రానికి నివేదిక పంపనున్నారు. కిట్స్ అందుబాటులోకి వచ్చిన తరువాత ఆధార్ నమోదు, అప్‌డేట్ ప్రక్రియను చేపట్టనున్నట్లు ఉడాయ్ అధికారులు తెలిపారు.
- ఇదీ చూడండి : పాన్-ఆధార్ అనుసంధాన గడువు పొడిగింపు