Harish Rao on Food Adulteration: ఆహార పదార్థాలు కల్తీ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనీ, ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. మరోవైపు ప్రజల్లో అవగాహన పెంచే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్, ఆహార పరిరక్షణ, ప్రయోగశాల పనితీరు, సాధించిన పురోగతి, లక్ష్యాలు తదితర అంశాలపై ఆదివారం హరీశ్‌రావు ఉన్నతాధికారులతో హైదరాబాద్‌లో సమావేశమయ్యారు.
కల్తీ ఆహారంతో ప్రజారోగ్యం దెబ్బతింటోందనీ.. దీర్ఘకాలంలో మధుమేహం, అధిక రక్తపోటు వంటి అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయనీ, జీర్ణకోశ సమస్యలు, క్యాన్సర్ వంటి ప్రమాదకర జబ్బులకూ దారితీస్తుందని హరీశ్ రావు తెలిపారు. కల్తీని అడ్డుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని పేర్కొన్నారు. ఆహార కల్తీని అడ్డుకోవడంలో భాగంగా రూ.2.4 కోట్ల వ్యయంతో 4 ప్రత్యేక వాహనాలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిందని హరీశ్ అన్నారు. గ్రామాల్లో, బస్తీల్లో ఈ వాహనాలు పర్యటిస్తూ ఆహార కల్తీ పరీక్షలను చేపడుతున్నాయని చెప్పారు.
'ఐపీఎంలో రూ.10 కోట్ల వ్యయంతో ఆహార కల్తీని కనుగొనే ప్రయోగశాలను నెలకొల్పాం. అన్ని మొబైల్ వాహనాలు పనిచేయాలి. బృందాలు జిల్లాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టాలి. రక్త నిధి కేంద్రాల్లో నిల్వలు పెంచాలి. ప్రాంతీయ ఆసుపత్రులకు అవసరమైన రక్తాన్ని సరఫరా చేయాలి. తలసేమియా బాధితులకు ఉచితంగా ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. ప్రజలు సైతం బాధ్యతగా వ్యవహరించాలి. ఎక్కడైనా ఆహార కల్తీ జరిగినట్లు గుర్తిస్తే.. వెంటనే 040 21111111 టోల్‌ఫ్రీ నంబర్‌కి కాల్ చేసి సమాచారం ఇవ్వాలి లేదా ట్విటర్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. ఫిర్యాదులు రాగానే అధికారులు వెళ్లి చర్యలు తీసుకుంటారు’. -హరీశ్ రావు, వైద్యారోగ్య శాఖ మంత్రి
సమావేశంలో ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, సీఎంవో ప్రత్యేకాధికారి డాక్టర్ టి.గంగాధర్, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఎండీ చంద్రశేఖరరెడ్డి, ఐపీఎం ఫుడ్ సేఫ్టీ డైరెక్టర్ శివలీల, అన్ని జిల్లాల ఆరోగ్య పరిరక్షణ అధికారులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: భారత్ గెలిచిన ప్రతిష్టాత్మక 'థామస్' కప్ గురించి ఈ విషయాలు తెలుసా?
University education departmet: కాకతీయలో విద్యావిభాగం ఖాళీ.. మూడు వర్సిటీలకు ఒక్కరే డీన్