కొవిడ్-19 బాధితులకు చికిత్స అందించే వైద్యులు, పారామెడికల్ సిబ్బందిపై దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు చేపడతామని డీజీపీ మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. కొవిడ్ వైరస్ బాధితులకు చికిత్స అందించడం, ఐసోలేషన్ కేంద్రాలు గాంధీ, ఉస్మానియా, ఫీవర్, ఎంజీఎం తదితర ఆసుపత్రుల్లో 24 గంటల పాటు సేవలందిస్తున్నారని ఆయన తెలిపారు. ఇటీవల వైద్యులపై జరిగిన దాడుల ఘటనల్లో బాధ్యులను అరెస్టు చేశామన్నారు. పలు సెక్షన్ల కింద కేసులు సైతం నమోదు చేశారని చెప్పారు.
వైద్యులు, పారామెడికల్ సిబ్బందితో ఎవరైనా దురుసుగా ప్రవర్తిస్తే చర్యలు మరింత కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. కోవిడ్ బాధితులు, వారి సంబంధీకులైనా సరే వైద్యులపై దాడి చేస్తే ఉపేక్షించేది లేదన్నారు. ప్రజలు నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని మహేందర్‌రెడ్డి కోరారు.