పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. పార్టీలు.. గెలుపే లక్ష్యంగా వ్యూహాలతో దూసుకెళ్తున్నాయి. అధికార, విపక్షాల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు కొనసాగుతున్నాయి. అధికార తెరాస నుంచి... మంత్రుల సహా కీలక నేతల వరకు ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల కల్పనపై.. విపక్షాలు తప్పుడు లెక్కలు చూపి యువతను అయోమయపరిచే ప్రయత్నం చేస్తున్నాయని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆరోపించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్సీ రాంచందర్‌రావుకు బహిరంగ లేఖలు రాశారు.
సురభి వాణిదేవిని గెలిపించండి: మంత్రి హారీశ్
తన సంస్థల ద్వారా ఎంతో మందిని ఉన్నత విద్యావంతులను చేసిన సురభి వాణీదేవిని గెలిపించాలని అర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు కోరారు. వికారాబాద్‌లోని కొత్తగడిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన సన్నాహక సమావేశంలో విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు.
కాంగ్రెస్ నుంచి స్టార్ క్యాంపెయినర్లు..
మండలి ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జీలను నియమించింది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి.. ఎన్నికల ప్రచార, సమన్వయకర్తలు, స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించారు. హైదరాబాద్- మహబూబ్ నగర్- రంగారెడ్డి స్థానానికి ప్రచారకర్తగా ఎంపీ రేవంత్ రెడ్డి, సమన్వయకర్తగా ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్‌ను నియమించారు. నల్గొండ- ఖమ్మం- వరంగల్ నియోజకవర్గ ప్రచారకర్తగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సమన్వయకర్తగా కాంగ్రెస్ ఆదివాసీ జాతీయ వైస్ ఛైర్మన్ బెల్లయ్య నాయక్‌ను ప్రకటించారు. స్టార్ క్యాంపెయినర్లుగా మాజీ కేంద్ర మంత్రి రేణుకాచౌదరి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని నియమించారు.
ఉద్యోగాలు ఎప్పుడిచ్చారు: పీసీసీ చీఫ్ ఉత్తమ్
ఖమ్మంలో గిరిజన ఉపాధ్యాయ సంఘాల ఆత్మీయ సమ్మేళనంలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. ఉద్యోగాల భర్తీ విషయంలో తెరాస నాయకులు చెప్పేదంతా బూటకమని ఆరోపించారు. ములుగులోని ఓ ఫంక్షన్‌హాల్‌లో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశానికి ఎమ్మెల్యే సీతక్క హాజరయ్యారు. వేలాది మంది నిరుద్యోగుల ఆత్మ బలిదానాల సాక్షిగా ఏర్పడిన రాష్ట్రం.. నేడు గడిల్లో బందీ అయిందని ఆరోపించారు.
భాజపా ఓటమికి తెరాస కుట్రలు: ఎమ్మెల్యే రఘునందన్
మంచిర్యాలలో భాజపా ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యకర్తల శిక్షణ తరగతులకు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచినా మంచిదే కానీ భాజపా మాత్రం గెలవకూడదని తెరాస కుట్రలు పన్నుతోందని ఆరోపించారు.
కేటీఆర్ చర్చకు రావాలి: ఎమ్మెల్సీ రామచందర్‌రావు
పురపాలక శాఖమంత్రి కేటీఆర్‌కు ఎమ్మెల్సీ రామచందర్‌రావు బహిరంగ లేఖ రాశారు. మహాబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల స్థానం నుంచి మరోసారి పోటీ చేస్తున్న తాను.. ఈ ఆరేళ్లలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై గళమెత్తిన విషయాన్ని గుర్తుచేశారు. రాష్ట్రంలో సమస్యలపై చర్చకు రావాలని కేటీఆర్‌కు సవాల్ విసిరారు.
బహుజనులను గెలిపించండి: గాలి వినోద్ కుమార్
త్వరలో జరిగే పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల్లో పోటీ చేసే బహుజనులను ఎమ్మెల్సీలుగా గెలిపించుకోవాలని సౌత్ ఇండియా పొలిటికల్ ఐకాస ఛైర్మన్ గాలి వినోద్ కుమార్ కోరారు. హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థులు పాల్గొన్నారు.
ప్రశ్నించేవారికి ఓటేయండి: నాగేశ్వర్
రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ప్రశ్నించే గొంతుకకు ఓటేసి గెలిపించాలని ఎమ్మెల్సీ అభ్యర్థి నాగేశ్వర్ కోరారు. నారాయణపేటలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఇదీ చదవండి: పరిస్థితులను సమీక్షించుకొని ముందుకెళ్లాలి: కేసీఆర్