గ్రేటర్ హైదరాబాద్లోని నాలాల అభివృద్ధికి ప్రభుత్వం సన్నద్ధమైంది. నగరంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. అందుకు ప్రధాన కారణమైన నాలాలపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి... వాటిని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు.
అవసరమైన చర్యలు
గ్రేటర్ పరిధిలోని నాలాల అభివృద్ధి కోసం వ్యూహాత్మక నాలా డెవలప్మెంట్ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించినట్లు మంత్రి వెల్లడించారు. నాలాలకి ప్రత్యేకించి ఒక నూతన ప్రాజెక్టు విభాగాన్ని ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. లోతట్టు ప్రాంతాలన్నీ వరదలతో జలమయం అవ్వడానికి నాలాలే ప్రధాన కారణమని... వివిధ శాఖల అధికారులు ప్రాథమికంగా తేల్చారు. ఈ నేపథ్యంలో నగరంలో ఉన్న నాలాలపై అధ్యయనం చేసి... ఎక్కడైతే అత్యంత సంక్లిష్ట పరిస్థితి ఉన్నదో, అక్కడ నాలాలను వెంటనే విస్తృత పరచాలని అధికారులకు సూచించారు. నాలాలపై ఉన్న కబ్జాలను తొలగించి... వరద సాఫీగా కిందికి వెళ్లేందుకు అవసరమైన చర్యలను తీసుకోవాలన్నారు.
ఫీడర్ నాలాలు సైతం
కేవలం నాలాలు మాత్రమే కాకుండా ఫీడర్ నాలాలను కూడా ఈ స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాంలో పరిశీలించి వాటికి సంబంధించిన... అవసరమైన... అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేపడతామని మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమాలు చేపట్టేందుకు త్వరలోనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే రహదారుల కోసం ప్రత్యేకంగా స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాంని ఏర్పాటు చేసి... మంచి ఫలితాలు రాబట్టామని... ఇదే విధంగా నాలాల విషయంలోనూ చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు.
చీఫ్ ఇంజినీర్, ఇతర సీనియర్ ఇంజినీర్లతో కూడిన సాగునీటి శాఖ ఇంజినీర్లు, వరద నిపుణులు, సాగునీటి శాఖ నిపుణులు ఈ నూతన విభాగంలో భాగస్వాములుగా ఉండబోతున్నారు. ఈ ప్రత్యేక విభాగం నాలాలు, డ్రైనేజీలను అధ్యయనం చేసి భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా వీటిని అభివృద్ధి చేయనున్నారు. నాలాలపై ఆక్రమణల తొలగింపు బాధ్యతలను కూడా ప్రత్యేక విభాగానికే అప్పగిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.
ఇదీ చూడండి: 'సీజనల్ వ్యాధులు ప్రబలకుండా నగరమంతా శానిటైజేషన్ డ్రైవ్'