ఒకప్పుడు పిల్లలు అన్నం తినాలన్నా... నిద్రపుచ్చాలన్నా... మారాం చేసినా... ఒక్కటే మంత్రం.. కథలు చెప్పటం. ఇప్పుడు చిన్న కుటుంబాల్లో చిన్నారులకు కథలు చెప్పే అమ్మమ్మలు, తాతయ్యలు లేక పిల్లలు వీడియోగేమ్‌లు, కార్టూన్లకు అలవాటుపడ్డారు. కథలు చెప్పే సంస్కృతి పాతదే అయినా..చెప్పుకుంటూ ఉపాధి పొందవచ్చని నిరూపిస్తున్నారు కొందరు కథకులు.
కథలతో ఉత్తేజం.. ఉత్సాహం..
పిల్లలు గాడ్జెట్లు, కార్టూన్లతో కాలం గడిపితే... అనేక దుష్పరిణామాలుంటాయి. అదే సమయాన్ని కథలు వినిపించేందుకు కేటాయిస్తే అనేక లాభాలున్నాయంటున్నారు కథకులు. చదువు, ట్యూషన్‌తో ఎక్కువ సమయం గడిపే చిన్నారులకు కథలు కొత్త ఉత్తేజాన్ని నింపుతాయంటున్నారు. కొత్త విషయాలు, నీతి బోధపడతాయంటున్నారు.
నాటకీయతతో కథలు...
పిల్లల వయసు ఆధారంగా స్టోరీ నేరేటర్స్ కథలు ఎంపిక చేసుకుంటారు. ఉపకరణాలతో కథను, కథనాన్ని రక్తి కట్టిస్తారు. కథలో భాగంగా పాఠ్యాంశాలు, చిన్న చిన్న లెక్కలు నేర్పిస్తారు. నాటకీయత జోడించి చిన్నపాటి మ్యూజిక్ పరికరాలతో కథను అందంగా మలుస్తున్నారు.
పిల్లల ఆసక్తిని బట్టి ఎంపిక...
అనగనగా ఒక రాజు.. రాజుకు ఏడుగురు కొడుకులు.. వంటి రొటీన్ కథలే కాక.. అన్ని రకాల కథలు చెబితేనే ఆదరణ ఉంటుందని అంటున్నారు కథకులు. గ్రూప్ స్టోరీ టెల్లింగ్, రాండమ్ స్టోరీ టెల్లింగ్, డ్యుయల్ స్టోరీ టెల్లింగ్, డెవిల్ స్టోరీ టెల్లింగ్, డ్రమటిక్ స్టోరీ టెల్లింగ్ వంటివి అనేక రకాలున్నా.. పిల్లల వయసు, ఆసక్తిని బట్టి ఎంపిక చేసుకుంటారు. కథ చెప్పే వారు ముందుగా ఆర్టిస్ట్‌గా మారి... తమలో ఉన్న యాక్టింగ్ నైపుణ్యాలతో పిల్లను మంత్రముగ్ధుల్ని చేస్తారు.
స్టోరీ టెల్లింగ్‌కు ప్రధానబలం కమ్యూనికేషన్ నైపుణ్యాలే. ఈ వృత్తికి రానురాను డిమాండ్ పెరుగుతోంది. ఇప్పుడిప్పుడే ఈ సంస్కృతి దేశమంతటా విస్తరిస్తోంది.
ఇవీ చూడండి: అవును.. ఈ పువ్వులు వాడిపోవు
ఇవీ చూడండి: ఓ దుర్ఘటన.. వినూత్న ఆలోచన.. కలిస్తే విజయం