TS Assembly Session: రాష్ట్రంలో అధికార, విపక్షాల వ్యూహప్రతివ్యూహాలు, విమర్శల దాడులు, ఎదురుదాడులతో రాజకీయ వాతావరణం గరంగరంగా ఉన్న తరుణంలో శాసనసభ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమవుతున్నాయి. అరుదైన రీతిలో గవర్నర్ ప్రసంగం లేకుండానే ఈ సమావేశాలు జరుగుతున్నాయి. ఉదయం 11.30 గంటలకు శాసనసభలో ఆర్థికమంత్రి హరీశ్‌రావు బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ప్రసంగిస్తారు. శాసనమండలిలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి బడ్జెట్‌ను సమర్పిస్తారు. ప్రస్తుత శాసనసభ గడువు వచ్చే ఏడాది డిసెంబరు వరకు ఉండగా... ప్రభుత్వానికి పూర్తిస్థాయి బడ్జెట్ ఇదే కానుంది. కొవిడ్ నిబంధనల మేరకు సమావేశాలకు ఏర్పాట్లు చేశారు.
వివాదాలతో మొదలు
గత ఏడాది అక్టోబరు 8న శాసనసభ సమావేశాలు ముగిశాయి. అప్పటి నుంచి సభ ప్రొరోగ్ కాలేదు. అవే సమావేశాలను ఇప్పుడు కొనసాగిస్తున్నారు. సభ ప్రొరోగ్ కానందున గవర్నర్ ప్రసంగం లేకుండానే సమావేశాలు నిర్వహించనున్నారు.
దీనిపై గవర్నర్ తమిళిసై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగం లేకపోవడం వల్ల శాసనసభ్యులు ప్రభుత్వ పనితీరుపైన, ప్రజా సమస్యలపైన చర్చించే అవకాశం కోల్పోతారని తెలిపారు. దీనిపై ప్రభుత్వవర్గాలు అనధికారిక ప్రకటనలో వివరణ ఇచ్చాయి. గవర్నర్ ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, అవసరం లేని అంశాలపై అభ్యంతరాలు చెబుతున్నారని ఉదాహరణలతో ఆమె వైఖరిని విమర్శించాయి. శాసనసభలో దీనిపై మొదట్లోనే చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది.
రగులుతున్న రాజకీయ వేడి
కేంద్రప్రభుత్వం, భాజపాపై ముఖ్యమంత్రి కేసీఆర్ బహుముఖ దాడిని ప్రారంభించారు. గత నెలలో జరిగిన ప్రధాని మోదీ పర్యటనలో సీఎం పాల్గొనలేదు. ప్రధానిపై, భాజపాపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. జాతీయస్థాయిలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పాటుపైనా కసరత్తు చేస్తున్నారు. మరోవైపు భాజపా, కాంగ్రెస్‌లు ప్రభుత్వ విధానాలపై పోరుబాట సాగిస్తున్నాయి. భాజపా అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిలు నిరంతర కార్యక్రమాలతో ప్రభుత్వ వైఖరిపై దండెత్తుతున్నారు. వైఎస్సార్ తెలంగాణ, బహుజన్‌సమాజ్ పార్టీలు సైతం ప్రభుత్వ విధానాలను దుయ్యబడుతున్నాయి.
15 రోజుల పాటు సమావేశాలు!
బడ్జెట్ ప్రసంగాల అనంతరం శాసనసభలో స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలిలో ప్రొటెం ఛైర్మన్ అమీనుల్ జాఫ్రిల అధ్యక్షతన సభా కార్యకలాపాల కమిటీ (బీఏసీ) సమావేశాలు జరుగుతాయి. సమావేశాల ఎజెండా, సభలను ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశాలను నిర్ణయిస్తారు. రెండు వారాల పాటు సమావేశాలు నిర్వహించవచ్చని సమాచారం. సంప్రదాయం ప్రకారం బడ్జెట్ ప్రవేశపెట్టిన మర్నాడు (మంగళవారం) సెలవు ప్రకటిస్తారు. మళ్లీ బుధవారం నుంచి సమావేశాలు జరిగే వీలుంది.
అన్ని పక్షాలూ అస్త్రశస్త్రాలతో..
సభలో తెరాస తమ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఎలుగెత్తి చాటాలని, విపక్షాలను ఉక్కిరిబిక్కిరి చేయాలని భావిస్తోంది. ప్రగతి గణాంకాలు, పురస్కారాలు సహా.. రాష్ట్రంలోని ప్రధాన అంశాలన్నింటినీ చర్చకు పెట్టి వివరించాలనుకుంటోంది. కేంద్రం నుంచి ఏ మాత్రం సాయం లేదని గణాంకాలతో చాటనుంది. అయిదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగితే దానికి వ్యతిరేకంగా సభలో తీర్మానం చేయాలని భావిస్తోంది. విపక్షాలు సైతం పెద్దఎజెండాతో సన్నద్ధమయ్యాయి. ఉద్యోగాల భర్తీ, 317 జీవో రద్దు, రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణంలో జాప్యం, గవర్నర్‌కు అగౌరవం వంటి అంశాలను భాజపా ప్రస్తావించనుంది. గత సమావేశాల సందర్భంగా భాజపాకు ఇద్దరు సభ్యులుండగా, హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్ గెలుపుతో ఆ పార్టీ సభ్యుల సంఖ్య మూడుకు చేరింది. కాంగ్రెస్ సైతం రాష్ట్రంలోని సమస్యలు, హామీలతోపాటు, ఐఏఎస్, ఐపీఎస్‌ల కేటాయింపుల్లో తెలంగాణ అధికారులపై నిర్లక్ష్యం వంటి అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయనుంది. కాంగ్రెస్‌లో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అసంతృప్తి స్వరం వినిపిస్తున్నందున సభలో ఆయన వైఖరిపై ఆసక్తి నెలకొంది.
మండలి ఛైర్మన్ ఎన్నికకు అవకాశం
శాసనమండలి కొత్త ఛైర్మన్ ఎన్నికకు ఈ నెల 9న నోటిఫికేషన్ వెలువడవచ్చని భావిస్తున్నారు. ఛైర్మన్ పదవికి ఎమ్మెల్సీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, కడియం శ్రీహరి, మధుసూదనాచారిల పేర్లు, డిప్యూటీ ఛైర్మన్‌గా బండా ప్రకాశ్ పేరు పరిశీలనలో ఉన్నాయి.
ఇదీ చదవండి: