కారు బయటకు తీయలే..
కూకట్‌పల్లి వివేకానందనగర్‌లో ఉంటున్న వ్యక్తికి ఇన్నోవా కారుంది. గతనెల 28న ఆయన చరవాణికి సంక్షిప్త సందేశం వచ్చింది. అల్వాల్ పరిధిలో మితిమీరిన వేగంతో కారు నడిపారంటూ ట్రాఫిక్ పోలీసులు ఈ-చలాన్ పంపించారు. సంక్షిప్త సందేశాన్ని చూసిన ఆయన ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. నాలుగురోజుల నుంచి కారు బయటకు తీయలేదని, కంగారుగా ట్రాఫిక్ పోలీసులకు ఫోన్ చేయగా.. గచ్చిబౌలిలోని ట్రాఫిక్ పోలీస్ డీసీపీ కార్యాలయానికి రావాలని చెప్పారు. అక్కడికి వెళ్లగా తప్పుడు చలాన్ వచ్చింది.. తొలగించండి అంటూ అతనితో లేఖ రాయించుకున్నారు. సికింద్రాబాద్‌లోని ఓ ద్విచక్రవాహనదారుడికీ ఇదే అనుభవం ఎదురైంది. తన బైక్ నంబర్‌కు వేరే వాహనం చలానాలు వస్తున్నాయని, 2 నెలల్లో 15 వచ్చాయని వివరించాడు.
మూడు పోలీస్ కమిషనరేట్లలోనూ..
మూడు పోలీస్ కమిషనరేట్లలోని ట్రాఫిక్ పోలీసులు రద్దీ రోడ్లపై ఉంటూ చిన్న కెమెరాలతో నిబంధనల ఉల్లంఘనులను ఫొటోలు తీస్తున్నారు. దూరంలోని వాహనాల నంబర్లు సరిగ్గా కనపడటం లేదు. కొన్నింటి అంకెలు స్పష్టంగా లేవు. 6ని 8గా 7ను.. 9గా 0ను 6గా భావించి అవే నంబర్లకు ఈచలాన్‌లు పంపుతున్నారు. దీంతో ఇతరులకు చలానాలు వెళ్తున్నాయి. ఒక్కో కమిషనరేట్ పరిధిలో నెలకు 500వాహనాల నుంచి 900 వాహనాల వరకు తప్పుడు చలానాలు వెళ్తున్నాయని అంచనా.
సమాచారమిస్తే చాలు
తాము నిబంధలనలను ఉల్లంఘించకపోయినా ఈ-చలాన్ వచ్చిందంటూ ట్రాఫిక్ పోలీసులకు సమాచారమిస్తే సరిపోతుంది. జరిమానా చెల్లించాల్సిన అవసరం లేదు. వివరాలను పరిశీలించిన 24 గంటల్లో తప్పుడు చలాన్ తొలగిస్తాం. కొందరు నంబర్ ప్లేట్లను వంచేస్తున్న కారణంగా ట్రాఫిక్ పోలీసులు పొరపడుతున్నారు. - ఎస్.విజయ్‌కుమార్, డీసీపీ (ట్రాఫిక్) సైబరాబాద్
- ఇదీ చూడండి: మహావిష్ణువు కొలువుండే ఐదు ప్రదేశాలేంటో తెలుసా?