హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం 430 కి.మీ. మేర కాలిబాటలున్నాయి. ఒకట్రెండు ప్రాంతాల్లో మినహాయించి అన్నిచోట్ల ఆక్రమణలకు గురయ్యాయి. బంజారాహిల్స్ రోడ్డు నం.10, 12లో అయితే కి.మీ. మేర రోడ్డులో కలిసిపోయాయి. రద్దీగా ఉండే కోఠి, దిల్‌సుఖ్‌నగర్, సికింద్రాబాద్, అమీర్‌పేట, ఆబిడ్స్, ఖైరతాబాద్ ప్రాంతాల్లో వ్యాపారాలు నడుస్తున్నాయి. కొన్నిచోట్ల శాశ్వత నిర్మాణాలూ వెలిశాయి. చాలా ప్రాంతాల్లో ఆధునికీకరించిన పాదబాటలు హోటళ్లు, ఇతర కార్యాలయాల వాహనాల పార్కింగ్ స్థలాలుగా ఉపయోగపడుతున్నాయి. లక్డీకాపూల్, ఖైరతాబాద్, హిమాయత్‌నగర్, బంజారాహిల్స్, అమీర్‌పేట, నల్లకుంట, మెహిదీపట్నం, మియాపూర్, మూసాపేట తదితర ప్రాంతాల్లో ఆక్రమణలు కనిపిస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదు. గతంలో తొలగించిన వాటిలో దాదాపు 80 శాతానికి పైగా ఆక్రమించారనేది క్షేత్రస్థాయి వాస్తవం.
చోద్యం చూస్తూ..!
సుమారు 300కు పైగా శాశ్వత మరుగుదొడ్లు, ఎన్నికలకు ముందు హడావుడిగా నిర్మించి వదిలేసిన 8 వేలకు పైగా తాత్కాలిక మరుగుదొడ్లు, 141 అన్నపూర్ణ కేంద్రాలు, వందకుపైగా వాటర్ ఏటీఎంలతో పాటు మరో 2 వేలకు పైగా బస్‌స్టాపులు ఈ కాలిబాటలపైనే ఉన్నాయి. ఇవి గ్రేటర్ వాసుల్ని మరింత ఇబ్బందుల పాల్జేస్తున్నాయి. ఇవి అడ్డుగా ఉన్న చోట్ల కాలిబాటలు దిగి రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.. ఆ సమయంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. నగరంలో రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న వారిలో 20 శాతం పాదచారులే ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
గ్రేటర్ ఎన్నికలకు ముందు హడావుడిగా నిర్మించిన వేలాది తాత్కాలిక మరుగుదొడ్లు కాలిబాటల్ని అధ్వానంగా తయారుచేస్తున్నాయి. సరైన నీటి, డ్రైనేజీ కనెక్షన్లు లేకపోవడంతో దుర్గంధం వెదజల్లుతున్నాయి.
- ఇదీ చూడండి: డ్యూటీలో నేరస్థుల వేట.. గ్రౌండ్లో క్రికెట్ ఆట!