''ఓ వ్యక్తి ప్రైవేటు సంస్థలో ఉద్యోగి. నెలకు రూ.25వేల వేతనం. భార్య, ఇద్దరు పిల్లలు, తల్లితో మణికొండలో ఉంటున్నారు. ఇటీవల కరోనా బారిన పడ్డాడు. ఆరోగ్యం క్షీణించటంతో గచ్చిబౌలిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో చేర్చిన రోజు రూ.1.50 లక్షలు కట్టించుకున్నారు. ఐదు రోజుల వ్యవధిలో సుమారు రూ.3 లక్షల వరకూ చెల్లించారు. మరో రూ.2 లక్షలు ఉంటేనే అతడు క్షేమంగా బయట పడతారని ఆసుపత్రి సిబ్బంది బాధితుడి భార్యకు తేల్చిచెప్పారు. కూతురు కోసం చేయించిన బంగారు ఆభరణాలు తాకట్టుపెట్టి ప్రస్తుతం వైద్యం అందిస్తున్నారు. ఆరోగ్య బీమా ఉన్నప్పటికీ నగదు కావాలని ఆసుపత్రి యాజమాన్యం డిమాండ్ చేయటంతో తప్పలేదంటూ ఆమె ఆవేదన వెలిబుచ్చారు.
‘ప్రదీప్(పేరుమార్చాం) పాతికేళ్ల యువకుడు. మంచి ఉద్యోగం. ఆరోగ్యంగా ఉండేవాడు. పెళ్లిచేసేందుకు సంబంధాలు చూస్తున్నారు. గత నెల 20న దగ్గు, జ్వరం వచ్చినా సాధారణంగానే భావించాడు. 23న రక్తంలో ఆక్సిజన్ స్థాయులు భారీగా పడిపోవటంతో అప్పటికప్పుడు సిద్దిపేట నుంచి అంబులెన్స్‌లో హైదరాబాద్‌కి తీసుకొచ్చి ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. 8 రోజులకే సుమారు రూ.11 లక్షల వరకూ ఖర్చు చేశారు. సొంతూళ్లో ఉన్న పొలాన్ని తనఖా పెట్టి రూ.9 లక్షలు తెచ్చినట్టు బాధితుడి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.
వారి బలహీనతే.. వీరి బలం
దూద్‌బౌలి ప్రాంతానికి చెందిన చిరుద్యోగి కుటుంబంలో తండ్రి(30) కూతురు(4), కుమారుడు(7నెలలు) మహమ్మారి బారినపడ్డారు. ఇప్పటికే రోజుకు రూ.30 వేలు ఖర్చుచేస్తున్న బాధితుడు మున్ముందు ఇంకెంత అవుతుందనే ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రి ఇటీవల రూ.1.50 లక్షల ఖర్చుతో కొవిడ్ రోగి కోలుకుంటాడని చేర్చుకున్నారు. తరువాత అత్యవసర వైద్యమంటూ రూ.6 లక్షల బిల్లు చేతికిచ్చారంటూ బోడుప్పల్‌కు చెందిన శేఖర్ వాపోయాడు. మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వాళ్లం.. ఎవరికి ఫిర్యాదు చేయలేం. మరెవరినీ నిందించలేం.. అంటూ పలువురు తమ నిస్సహాయతను చాటుతున్నారు.
ప్రతిదానికీ ఓ లెక్కుంది
ఐసీయూలో చేరి వెంటిలెటర్‌పై రోగి చికిత్స పొందుతున్నాడంటే లక్షలు కుమ్మరించాల్సిందేనంటూ నాచారం ప్రాంతానికి చెందిన ఓ వైద్యనిపుణుడు తెలిపారు. ఊపిరితిత్తులు, గుండె, మూత్రపిండాలు తదితర వైద్యనిపుణులు ఒక్కొక్కరు రోగిని ఒక్కసారి చూసి వెళ్లినందుకు రూ.750-1000 వరకూ ఫీజుగా తీసుకుంటారని తెలుస్తోంది. రోగిని చూసి వచ్చేందుకు పీపీఈ కిట్లు, శానిటైజర్లు, గ్లౌజుల ఖర్చు కూడా రోగి చెల్లించాల్సి ఉంటుందంటూ ప్రముఖ వైద్యుడొకరు వివరించారు. కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు వైద్యులకూ లక్ష్యాలను నిర్దేశిస్తున్నట్లు సమాచారం. ఆర్‌ఎంపీలు, స్థానికంగా వైద్యం అందించే వైద్యుల ద్వారా కొవిడ్ రోగులను చేర్చుకుంటే కొంతమేర కమీషన్ కూడా ఇస్తామంటున్నట్టు తెలుస్తోంది. నగర శివార్లలో ఓ ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యం.. గతేడాది కోల్పోయిన నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు ఇదే అనువైన సమయమంటూ అంతర్గత సమావేశంలో చర్చించటం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది.
ఇదీ చూడండి:టీకాపై సందేహాలా? ఇవిగో సమాధానాలు...