రాష్ట్రంలో ప్రభుత్వ భూముల విక్రయాన్ని వెంటనే నిలిపివేయాలని సీపీఐ (Cpi) రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి (Chada Venkat Reddy) డిమాండ్ చేశారు. భూముల విక్రయాలు నిలిపివేయాలని హైదరాబాద్ బషీర్బాగ్లోని పరిశ్రమ భవన్ టీఎస్ఐఐసీ కార్యాలయం వద్ద సీపీఐ (Cpi) నాయకులు ధర్నా నిర్వహించారు. భూములు గతంలో భూస్వాముల చేతిలో ఉండేవని కానీ నేడు రియల్ ఎస్టేట్ వారి చేతిలోకి వెళ్లిపోయాయన్నారు.
రాష్ట్రంలో దేవదాయ, వక్ఫ్ బోర్డు ఇలా అన్ని భూములు అన్యాక్రాంతం అవుతున్నా... ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. మొదటగా ఆక్రమించిన వారి భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా భూములు కబ్జాలు చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్, వరంగల్ ఇతర నగరాల్లో గుడిసెల్లో నివసిస్తున్న వారికి పట్టాలు ఇస్తామని సీఎం హామీ ఇచ్చినా.. ఇప్పటి వరకు ఒక్క పట్టా ఇచ్చిన దాఖలాలు లేవన్నారు.
భూముల విక్రయాలపై అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే ప్రభుత్వం పునరాలోచించి భూముల వేలాన్ని నిలిపివేయాలని లేదంటే అడ్డుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చదవండి:Corona: రూ.80 లక్షలు ఖర్చు చేసినా.. కుటుంబంలో ముగ్గురు మృతి