పాఠశాలలకు తమ పిల్లలను పంపుతున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అనుమతి పత్రాలు తప్పని సారిగా తీసుకోవాలని... రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ అధికారులను ఆదేశించారు. పాఠశాలల్లో కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అన్నారు. భవనాలన్నీ సిద్ధం చేసి, సానిటైజ్ చేయాలని అన్నారు. ఫిబ్రవరి 1నుంచి 9,10 తరగతులకు పాఠశాలలు ప్రారంభం కానున్నందున ఐటీడీఏ, గిరిజన సంక్షేమశాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
89వేల మంది విద్యార్థులు...
గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని పాఠశాలల్లో దాదాపు 89వేల మంది విద్యార్థులు వచ్చే అవకాశం ఉందన్నారు. చిన్న చిన్న మరమ్మత్తుల కోసం ప్రతి విద్యాలయానికి రూ.20వేల మంజూరు చేసినట్లు వెల్లడించారు. కొవిడ్ సమయంలో జీసీసీ బాగా పనిచేసిందని ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రశంసించినట్లు మంత్రి తెలిపారు. జీసీసీ ద్వారా తయారైన శానిటైజర్, మాస్క్‌లకు మంచి గుర్తింపు వచ్చిందని... సిబ్బందిని అభినందించారు.
భయపడాల్సిన అవసరం లేదు...
డిజిటల్ తరగతుల ద్వారా కేవలం 25 శాతం మంది విద్యార్థులకు మాత్రమే బోధన అందించగలమని మంత్రి పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి మాస్కులు, శానిటజర్ తప్పని సారిగా వినియోగించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. తల్లిదండ్రులు, విద్యార్థులు ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని... ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటుందని తెలిపారు.
ఇదీ చదవండి: పీఆర్సీనీ వెంటనే ప్రకటించాలి : ఉద్యోగుల ఐక్యవేదిక