రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలపై దృష్టి సారించడం లేదన్న భాజపా నేతల వ్యాఖ్యలను ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ఖండించారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ హుస్నాబాద్ బహిరంగ సభలో విమర్శలు చేయటం హాస్యాస్పదమన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు వైద్య కళాశాలలు మంజూరు చేసిన కేంద్రం.. తెలంగాణకు కనీసం ఒక్కటైనా మంజూరు చేయలేదని విమర్శించారు. ఈ విషయంపై బండి సంజయ్ ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రతి జిల్లాకు వైద్య కళాశాల ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందని వినోద్ కుమార్ వెల్లడించారు.
'బండి సంజయ్ పాదయాత్రకు ప్రజల నుంచి స్పందన రాలేదు. పాదయాత్రలో ఎటు చూసినా పచ్చదనమే ఉంది కాబట్టే ఆయనకు ఏమి మాట్లాడాలో తెలియలేదు. తెలంగాణలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదనేది అవాస్తవం. భాజపా పాలిత ప్రాంతాల్లోనే 2నెలలకోసారి జీతాలు ఇస్తున్నారు. భాజపా నిరాశానిస్పృహలో ఉంది.' -వినోద్ కుమార్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు
తెలంగాణకు ఎంత కరవు వచ్చినా మూడేళ్ల వరకు నీటి సమస్య ఉండదని వినోద్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. విద్యావైద్యంలో తమకు ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రం ఏర్పడక ముందు 5 మెడికల్ కాలేజీలు ఉంటే ఇప్పుడు 9 కాలేజీలు ఉన్నాయని.. మరో 4కాలేజీలు కూడా ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నామని వెల్లడించారు. పార్లమెంట్‌లో బండి సంజయ్ తెలంగాణ కోసం ఏం మాట్లాడారని నిలదీశారు.
ఇదీ చదవండి: REVANTH REDDY:'శ్రీకాంతాచారి స్ఫూర్తితో కాంగ్రెస్ ఉద్యమిస్తుంది'