Ministers will meet Piyush Goyal: ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖల మంత్రి పీయూష్ గోయల్‌తో తెలంగాణ మంత్రుల బృందం నేడు సమావేశం కానుంది. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించేందుకుగానూ మంత్రుల బృందం దిల్లీ వెళ్లి రెండు రోజులుగా నిరీక్షిస్తోంది. ఈ నేపథ్యంలో తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు, లోక్‌సభ పక్షనేత నామా నాగేశ్వరరావు పీయూష్ గోయల్‌ను సోమవారం పార్లమెంట్‌లో కలిశారు. మంత్రులు, ఎంపీల బృందం వేచిచూస్తున్న విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటలకు కలవాల్సిందిగా ఆయన సమయం ఇచ్చారని ఎంపీలు తెలిపారు.
లిఖితపూర్వక హామీ కావాలి...
ఎంత ధాన్యం వచ్చినా కొంటామని కేంద్రమంత్రులు చెబుతున్నప్పటికీ దీనిపై లిఖితపూర్వక హామీ ఇవ్వాలని మంత్రులు కోరుతున్నారు. వానాకాలం, యాసంగి కొనుగోళ్ల విషయంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి రైతులను గందరగోళపరుస్తున్నారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. రైతుల కోసం వస్తే... తమను నిరీక్షింపజేయడం అన్నదాతను అవమానించడమేనని వ్యాఖ్యానించారు. తెలంగాణ నుంచి వానాకాలం పంటకు సంబంధించి 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. రాష్ట్రంలో 62.19 లక్షల ఎకరాల్లో వరి సాగవుతున్నందున కొనుగోలును భారీగా పెంచాలని అప్పట్లో కోరామని నిరంజన్ రెడ్డి తెలిపారు. కొనేటప్పుడు ఆ విషయాన్ని పరిశీలిస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని పేర్కాన్నారు. లక్ష్యంగా నిర్దేశించిన 60 ఎల్‌ఎంటీలలో 55 ఎల్‌ఎంటీ కొనుగోలు ఇప్పటికే పూర్తయిందని అన్నారు. మంగళవారం ఉదయానికి మిగిలిన కొనుగోళ్లూ పూర్తవుతాయని... ఆ ధాన్యాన్ని ఎవరు కొనుగోలు చేస్తారో కేంద్రప్రభుత్వం చెప్పాలని నిరంజన్‌రెడ్డి కోరారు.
ఇదీ చదవండి: Alternative Crops: మినుము వైపు మొగ్గు.. ఏకంగా 58 ఎకరాల్లో సాగు