కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని ఎత్తిపోసేందుకు నీటిపారుదల శాఖ మరికొంత సమయం తీసుకోనున్నట్లు తెలిసింది. ఈ నెల రెండోవారం నుంచి ప్రాణహితలో నీటి లభ్యత పెరిగినా మేడిగడ్డ నుంచి ఎత్తిపోయడాన్ని ఇంకా ప్రారంభించలేదు. బ్యారేజీలతో సహా దిగువన రిజర్వాయర్లలో నీటి నిల్వలు ఉన్నందున ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి ప్రాజెక్టుల్లోకి వచ్చే ప్రవాహాలను బట్టి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది.
* కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కింద ఆయకట్టుకు నీటిని సరఫరా చేసే వ్యవస్థ ఇంకా పూర్తి కాలేదు. ఈ ప్రాజెక్టు పరిధిలోని అనంతగిరి, రంగనాయక్‌సాగర్‌లలో ఆరున్నర టీఎంసీల సామర్థ్యం ఉంది. ఈ రిజర్వాయర్ల కింద ఒకటిన్నర నుంచి రెండు టీఎంసీల నీటిని తీసుకునే అవసరం మాత్రమే ఈ ఏడాది ఉంటుందని సంబంధిత వర్గాల సమాచారం.
* కొండపోచమ్మ రిజర్వాయర్‌కు ఐదు టీఎంసీల నీటిని మళ్లించగా 0.2 టీఎంసీని చెరువులు నింపడానికి విడుదల చేశారు. దీని కింద ఆయకట్టుకు నీటిని సరఫరా చేసే కాలువల పనులు పూర్తికావడానికి ఇంకా సమయం పడుతుంది. కాబట్టి ఇప్పుడిప్పుడే అదనంగా నీటి అవసరం లేదు.
* వానాకాలపు సీజన్‌లో ఎక్కువ అవసరం శ్రీరామసాగర్ వ్యవస్థ ఆయకట్టుకు మాత్రమే. శ్రీరామసాగర్‌తో పాటు మిడ్‌మానేరు, దిగువమానేరులో ఉన్న నిల్వలు, ఎగువ నుంచి వచ్చే ప్రవాహాలను పరిగణనలోకి తీసుకుని అవసరాన్ని బట్టి మేడిగడ్డ నుంచి ఎత్తిపోత ప్రారంభించే అవకాశం ఉంది. 90.31 టీఎంసీల సామర్థ్యం గల శ్రీరామసాగర్‌లో ప్రస్తుతం 40 టీఎంసీలు ఉంది. బుధవారం 5,780 క్యూసెక్కులు వస్తుండగా, 8,477 క్యూసెక్కుల నీటిని బయటకు వదిలారు. దిగువన మిడ్‌మానేరులో 4.38 టీఎంసీల నీరు ఉంది. ఇందులో ఉన్న నీటిని క్రమంగా తగ్గించి దిగువమానేరులో నిల్వ పెంచారు. ఈ రిజర్వాయర్‌లో 12.75 టీఎంసీలు ఉంది. కాబట్టి దిగువ మానేరు పైన, దిగువన ప్రస్తుతం ఆయకట్టు అవసరాలకు ఎలాంటి సమస్య లేదు. ఆగస్టులో తగినంత ప్రవాహం లేకపోతేనే అవసరం అవుతుంది.
7.6 టీఎంసీల సామర్థ్యం ఉన్న కడెం ప్రాజెక్టులో 6.31 టీఎంసీల నీరుండగా... 1,900 క్యూసెక్కుల ప్రవాహం ఉంది. 20.18 టీఎంసీల సామర్థ్యం గల ఎల్లంపల్లిలో 7.14 టీఎంసీల నీరు ఉంది. నిండటానికి 13 టీఎంసీలు అవసరం. కడెంకు ప్రవాహం పెరిగి ఎల్లంపల్లికి వరద వస్తే నీటిని దిగువకు వదలాల్సి వస్తుంది. ఇదే సమయంలో మిడ్‌మానేరుకూ ఎత్తిపోయవచ్చు. మేడిగడ్డ నుంచి నీటిని ఎల్లంపల్లికి ఎత్తిపోయడం ప్రారంభించిన తర్వాత ఎల్లంపల్లికి వరద వస్తే ఎత్తిపోసిన నీటిని కూడా మళ్లీ దిగువకు వదలాల్సి వస్తుంది. శ్రీరామసాగర్‌తో పాటు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, ఎల్లంపల్లి బ్యారేజీలలో నిల్వలు, మిడ్‌మానేరు, దిగువ మానేరులో నిల్వలను పరిగణిస్తూ కాళేశ్వరం నుంచి నీటిని మళ్లించడంపై మరికొన్ని రోజులు ఎదురు చూసే అవకాశం ఉన్నట్లు నీటిపారుదల శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ప్రధాన గోదావరిలో ప్రవాహం తక్కువ ఉన్నా, ప్రాణహిత నుంచి వచ్చే నీటి వల్ల మేడిగడ్డ బ్యారేజీ వద్ద బుధవారం 95వేల క్యూసెక్కుల ప్రవాహం ఉంది. వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు వదిలేస్తున్నారు. ఇప్పటివరకు గోదావరిలో ధవళేశ్వరం వద్ద నుంచి 150 టీఎంసీలు సముద్రానికి వెళ్లింది.
ఇదీ చదవడి: సకల సౌకర్యాలతో.. సరికొత్త హంగులతో నూతన సచివాలయం: సీఎం కేసీఆర్