సింగరేణి గనులు, ఇతర ప్రాజెక్టుల్లో భూములు కోల్పోయిన గిరిజనులకు సంబంధించిన కోర్టు ధిక్కరణ వ్యాజ్యాలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. దీంతో రెండు వారాల్లోగా రాష్ట్రవ్యాప్తంగా గిరిజన సాధికారిత విధానాన్ని అమలు చేస్తామని ప్రభుత్వ తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. హామీని అమలు చేసి మూడు వారాల్లో నివేదిక సమర్పించాలని, లేనిపక్షంలో మళ్లీ కోర్టు ధిక్కరణ కేసు విచారణ చేపడతామని హైకోర్టు స్పష్టం చేసింది.
ప్రాజెక్టుల్లో భూములు కోల్పోయిన వారికి పరిహారంతో పాటు ఇంటికో ఉద్యోగం ఇచ్చేలా ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం 2010లో గిరిజన సాధికారిత విధానం రూపొందించింది. గిరిజన ప్రాంతాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని గతంలో హైకోర్టు తీర్పునిచ్చింది. రాష్ట్రంలో గిరిజన సాధికారిత విధానానికి సంబంధించిన కోర్టు తీర్పులు అమలు కావడం లేదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు. వాదనలు విన్నఅనంతరం రెండు వారాల్లో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామన్న ప్రభుత్వ హామీని నమోదు చేసిన ఉన్నత న్యాయస్థానం కోర్టు ధిక్కరణ వ్యాజ్యాలపై విచారణ ముగించింది.