కరోనా వైరస్ నివారణకు రాష్ట్రంలో ఈనెల 31 తర్వాత లాక్‌డౌన్, కర్ఫ్యూ కొనసాగించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించినట్లు ఏప్రిల్ 14 వరకు పొడగించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. గురువారం సీఎం కేసీఆర్ నిర్వహించిన సమీక్షలో ఇదే అంశంపై చర్చించినట్లు తెలిసింది. ఒకటి, రెండ్రోజుల్లో.. అందుకు సంబంధించిన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉంది.
మరింత పక్కాగా అమలు..
రాష్ట్రంలో కరోనా నివారణ, లాక్‌డౌన్, కర్ఫ్యూ అమలు తీరుపై ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి సహా పలువురు అధికారులు హాజరయ్యారు. నిత్యావసరాల గురించి ఇంటి నుంచి బయటకు వచ్చేవారి సంఖ్య అధికంగా ఉందని అధికారులు... ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. జనం తిరుగుతుంటే కరోనా కట్టడి ఆశించిన స్థాయిలో సాధ్యం కాదని... లాక్‌డౌన్, కర్ఫ్యూను మరింత పక్కాగా అమలు చేయాలని సీఎం అభిప్రాయపడ్డారు.
లాక్‌డౌన్, కర్ఫ్యూ పెంచే యోచన..
మరో ఐదు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వ లాక్‌డౌన్, కర్ఫ్యూ ముగుస్తున్నాయని.. అప్పటికీ పరిస్థితులు అదుపులోకి వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నందున వాటిని కొనసాగించాలని పేర్కొన్నట్లు తెలిసింది. కేంద్రం ఏప్రిల్ 14 వరకు లాక్‌డౌన్ ప్రకటించినందున అందుకు అనుగుణంగా వ్యవహరించాలనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సాధ్యమైనంత త్వరగా ప్రజలకు రూ. 1, 500 నగదు బదిలీ ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు. గ్రామాల్లో ధాన్యం, వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ వెంటనే ప్రారంభించాలని ముఖ్యమంత్రి చెప్పారు. కరోనాపై అప్రమత్తత, రాష్ట్రంలో వైరస్ ప్రభావం, నమోదైన కేసులు, చికిత్స తదితర అంశాలపైనా చర్చించి సీఎం కేసీఆర్ ఆస్పత్రులో సౌకర్యాలు పెంచాలని ఆదేశించారు.
ఇదీ చూడండి: నిబంధన అతిక్రమిస్తే చలానా ఇంటికొస్తుంది: డీజీపీ