రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. దేశ ఆర్థిక వృద్ధిరేటు గత ఏడాదిన్నర నుంచి తగ్గుతూ వస్తోందని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. కేంద్ర ఆదాయ వనరులు తగ్గడం వల్ల రాష్ట్రాలకు వచ్చే పన్నుల వాటాలోనూ, గ్రాంట్లలోనూ కోత పడిందన్నారు. ఆర్థికమాంద్య ప్రభావం రాష్ట్ర పన్నులు, పన్నేతర ఆదాయంపై పడిందని మంత్రి వ్యాఖ్యానించారు.
2019-20లో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటా రూ.3,731 కోట్లు తగ్గిందన్న మంత్రి.. కేంద్రం నుంచి రావాల్సిన ఐజీఎస్టీ, జీఎస్టీ పరిహారం, నిధులు సకాలంలో రావట్లేదన్నారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా అరకొరగా విడుదల చేస్తున్నారని ఆరోపించారు. దీనివల్ల 2018-19లో 16.1 శాతంగా ఉన్న రాష్ట్ర రెవెన్యూ వృద్ధిరేటు.. 6.3 శాతానికి తగ్గిందని తెలిపారు.