Budget Exercise: వచ్చే ఆర్థిక సంవత్సరం కోసం రాష్ట్ర వార్షిక బడ్జెట్ కసరత్తు ప్రారంభమైంది. 2022-23 బడ్జెట్ కోసం అన్నిశాఖల నుంచి ఆర్థికశాఖ ప్రతిపాదనలు స్వీకరించింది. ప్రస్తుత బడ్జెట్ అంచనాల్లో సవరణలు, ఇంకా చేయాల్సిన చెల్లింపులు, అవసరమయ్యే నిధుల వివరాలతోపాటు రానున్న ఆర్థిక సంవత్సరం కోసం అంచనాలు తీసుకొంది. అన్ని శాఖల నుంచి ప్రతిపాదనల కోసం రెండురోజుల క్రితం గడువు ముగిసింది. అన్ని శాఖల్లోని 210 శాఖాధిపతులకుగాను రెండు, మూడు మినహా అన్ని ప్రతిపాదనలు ఆర్థికశాఖకు చేరినట్లు సమాచారం. వాటన్నింటినీ ఆర్థికశాఖ క్రోడీకరించాల్సి ఉంది.
సన్నాహక సమావేశాలు
ప్రతిపాదనలన్నింటినీ క్రోడీకరించాక శాఖల వారీగా సమీక్షిస్తారు. ఇందుకోసం ఆర్థికశాఖ మంత్రి ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తారు. ఆ తర్వాత వాటిని ముఖ్యమంత్రి కేసీఆర్‌కి నివేదిస్తారు. వచ్చేనెల1న కేంద్ర వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అందులో రాష్ట్రానికి వచ్చే నిధుల విషయంలో స్పష్టత రానుంది. గ్రాంట్లు, కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించి కేంద్రం నుంచి ఏ మేరకు నిధులు వస్తాయో తేలిపోనుంది. వాటిని పరిగణలోకి తీసుకొని రాష్ట్రబడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేసే అవకాశం ఉంటుంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పన్నేతర ఆదాయం, కేంద్ర గ్రాంట్లు మినహా పన్ను ఆదాయం అంచనాలను దాదాపుగా చేరుకుంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. నవంబర్ వరకు 8 నెలల్లో పన్నుఆదాయం లక్ష్యాన్ని 60 శాతం చేరుకొంది. చివరి త్రైమాసికంలో పన్ను రాబడులు ఇంకా మెరుగ్గా ఉంటాయని అంటున్నారు. వాటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని వచ్చే ఆర్థిక సంవత్సరం అంచనాలను సిద్ధం చేయనున్నారు. శాఖల వారీగా పెరగనున్న వ్యయం, అవసరాలను పరిగణలోకి తీసుకోనున్నారు.
ఇదీ చూడండి: