Star Shelter Kidambi Srikanth: కిదాంబి శ్రీకాంత్.. అంతర్జాతీయ బ్యాడ్మింటన్లో మరోసారి తళుక్కుమన్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ పురుషుల విభాగం ఫైనల్‌లో సింగపూర్ క్రీడాకారుడు కియాన్ యో చేతిలో ఓడినప్పటికీ... రజత పతకం సాధించి ఈ ఘనతను అందుకున్న తొలి భారతీయ క్రీడాకారుడిగా నిలిచాడు. మహిళల విభాగంలో ఇప్పటికే పీవీ సింధు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. ప్రపంచ ఛాంపియన్ షిప్లో శ్రీకాంత్ రజత పతకం సాధించడంతో ఆంధ్రప్రదేశ్ గుంటూరులోని అతని స్వగృహం వద్ద సందడి వాతావరణం నెలకొంది. అతని తండ్రి కేవీఎస్ కృష్ణతోపాటు అభిమానులు, సహచరులు బాణసంచా కాల్చి పండగ చేసుకున్నారు.
BWF WORLD BADMINTON CHAMPIONSHIP KIDAMBI SRIKANTH: గుంటూరులో 2001లో షటిల్ పట్టిన శ్రీకాంత్.. పలుచోట్ల శిక్షణ పొంది ఆరితేరాడు. ఆసియా, ప్రపంచ జూనియర్ ఛాంపియన్ షిప్ పోటీల్లో ప్రతిభ చూపాడు. హైదరాబాద్ గోపీచంద్ అకాడమీలో చేరాక.. శ్రీకాంత్ ఆట మరింత రాటుదేరింది. షటిల్ బ్యాడ్మింటన్లో కీలకమైన సూపర్ సిరీస్ ప్రీమియం టైటిళ్లు, సూపర్ సిరీస్ టైటిళ్లు చెరో మూడు చొప్పున గెలుపొందాడు. 2014లో చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియం టైటిల్, 2015లో ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ గెలిచాడు. 2017లో శ్రీకాంత్ భీకర ఫామ్‌తో చెలరేగిపోయాడు. ఇండోనేషియా ఓపెన్ ప్రీమియం టైటిల్, ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్, డెన్మార్క్ ఓపెన్ ప్రీమియర్ టైటిల్ గెలుపొందాడు. అదే ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో సత్తా చాటాడు. ఇప్పటివరకు 3 గ్రాండ్ ప్రిక్స్ టోర్నీల్లో గెలుపొందాడు. 2018లో గోల్డ్ కోస్టులో జరిగిన కామన్వెల్త్ పోటీల్లో మిక్స్‌డ్ టీమ్ విభాగంలో బంగారు పతకం, సింగిల్స్ విభాగంలో వెండి పతకం గెల్చుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో ఫైనల్‌కి చేరడం ద్వారా శ్రీకాంత్ మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్లో ద్వితీయస్థానం సాధించడం వెనుక శ్రీకాంత్ శ్రమ, సాధన ఎంత చెప్పినా తక్కువే. తాజా ప్రతిభతో శ్రీకాంత్ ర్యాంకింగ్ పాయింట్లు కూడా గణనీయంగా మెరుగుపడే అవకాశముంది.
ఇదీ చూడండి: Kidambi Srikanth: ప్రపంచ బ్యాడ్మింటన్లో పడిలేచిన కెరటం