staff Shortage in Telangana municipalities : రాష్ట్రంలో నగర, పురపాలక సంఘాల్లో కీలక పోస్టులు ఖాళీగా ఉండటం వాటి అభివృద్ధిపై ప్రభావం చూపుతోంది. అడ్డుకునేవారు లేక వివిధ చోట్ల ఇష్టారాజ్యంగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఆరోగ్య కార్యక్రమాల పర్యవేక్షణ, అంటువ్యాధులు, దోమల నివారణ చర్యలు కుంటుపడుతున్నాయి. ఆస్తి పన్ను సహా పలు రకాల పన్ను వసూళ్లు మందగిస్తున్నాయి. వివిధ రకాల సిబ్బంది లేకపోవడంతో సేవల్లో జాప్యం జరుగుతోంది.
నాలుగేళ్ల క్రితం రాష్ట్రవ్యాప్తంగా కొత్త పురపాలికలు ఏర్పాటయ్యాయి. వీటికి కమిషనర్ సహా టౌన్ ప్లానింగ్, శానిటరీ అధికారి పోస్టులు మంజూరు కాలేదు. దీంతో ఇన్‌ఛార్జులు, అధికారుల డిప్యుటేషన్‌లతోనే పాలన సాగుతోంది. వరంగల్‌లో ఉప కమిషనర్, ఆరు ఏఈఈ పోస్టులు, డీఈ, ఈఈ, డిప్యూటీ, అసిస్టెంట్ సిటీ ప్లానర్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ పోస్టులు భర్తీ కాలేదు. నిర్మల్ మున్సిపాలిటిలో ఇంజినీరింగ్ విభాగంలో డీఈ, ఏఈ పోస్టుల్లో ఎవరినీ నియమించలేదు. పట్టణ ప్రణాళిక విభాగంలో అన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఫలితంగా యథేచ్ఛగా భవన, అక్రమ నిర్మాణాలు సాగుతున్నాయి.
కీలక ఉద్యోగులే లేరు..: పారిశుద్ధ్య పర్యవేక్షణ పోస్టుల్లోనూ నియామకాలు జరగలేదు. రామగుండంలో అదనపు కమిషనర్ సహా పారిశుద్ధ్య విభాగంలో కీలక ఉద్యోగులు లేరు. సూపరింటెండెంట్లు, బిల్ కలెక్టర్లు, జూనియర్ అసిస్టెంట్లు వంటి 27 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నల్గొండలో ఈఈ పోస్టుల్లో ఎవరిని నియమించలేదు. నర్సాపూర్ మున్సిపాలిటీలో కమిషనర్, ఏఈ, టీపీఎస్ పోస్టుల్లో ఇన్‌ఛార్జులే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మెదక్‌లో ఏఈ, టీపీవో, శానిటరీ ఇన్‌స్పెక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఇంఛార్జ్లే నడిపిస్తున్నారు..: ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక విభాగంలో వివిధ పోస్టులు ఇన్‌ఛార్జులతోనే నడుస్తున్నాయి. సూర్యాపేటలో ఖాళీల కారణంగా పనులపై ప్రభావం పడుతోంది. ఆదిలాబాద్‌లో పట్టణ ప్రణాళిక విభాగం ఖాళీ అయిపోయింది. యాదాద్రి, కామారెడ్డిలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. మంచిర్యాలలోనూ టౌన్ ప్లానింగ్, శానిటరీ, ఇంజినీరింగ్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
నిజామాబాద్‌లో కమిషనర్, డిప్యూటీ కమిషనర్ల ఊసే కనిపించడం లేదు. నాలుగు లక్షల జనాభా గల నగరపాలక సంస్థలో కమిషనర్, డిప్యూటీ కమిషనర్ పోస్టులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. స్మార్ట్ సిటీ కరీంనగర్‌లో పురపాలక వైద్యాధికారి పోస్టు ఏడాదిగా ఖాళీగా ఉంది. మిగతా విభాగాల్లోనూ ఖాళీలు ఉన్నాయి.