ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి 50వేల మందికి ఒక పట్టణ ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలి. ప్రతి ఆరోగ్య కేంద్రంలో ఒక వైద్యుడు, ఐదుగురు ఏఎన్ఎంలు, ఒక ఫార్మాసిస్ట్, ఒక ల్యాబ్ టెక్నిషియన్, ఒక హెల్త్ సూపర్ వైజర్, ఒక అటెండర్, ఒక ఆయా ఉండాలి. కానీ.. చాలావరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పూర్తిస్థాయి సిబ్బంది లేక రోగులు సతమతమవుతున్నారు. కరోనా బాధితులకు కనీసం వైద్య సలహాలు ఇచ్చేందుకు కూడా సరిపడా సిబ్బంది లేక.. సకాలంలో కరోనా పరీక్షలు జరగక.. వేలాది మంది రోగులు, బాధితులు ఆందోళన చెందుతున్నారు.
సిబ్బందికి సైతం కరోనా
ముషీరాబాద్‌లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 12 పోస్టులు ఉండగా.. అతి కీలకమైన ఫార్మసిస్ట్ పోస్టు ఖాళీగా ఉంది. ఈ కారణంగా కరోనా బాధితులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈఆరోగ్య కేంద్రానికి మరో ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న మెడికల్ ఆఫీసర్‌ను ఇంచార్జ్ ఒప్పంద మెడికల్ ఆఫీసర్‌గా నియమించారు. ప్రస్తుతం డిప్యూటేషన్ మీద విధులు నిర్వహిస్తున్న సదరు అధికారి కరోనా పాజిటివ్ రావడం వల్ల విధులకు హాజరు కావడం లేదు. వేరే మార్గం లేక.. ముషీరాబాద్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నర్సులతోనే కొనసాగుతోంది. దీనికి తోడు ఇక్కడ ఒక ఏఎన్ఎం పోస్టు కూడా ఖాళీగా ఉండడం వల్ల ఆరోగ్య సలహాల కోసం బాధితులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
వెనక్కి వెళ్లిపోతున్నారు..
ముషీరాబాద్ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సరైన వైద్య సదుపాయాలు లేకపోవడం వల్ల డీబీఆర్ మిల్లోనే చిక్కడపల్లి, ముషీరాబాద్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని బాధితులకు కరోనా పరీక్షలు, చికిత్స చేస్తున్నారు. దీంతో డీబీఆర్ మిల్ సిబ్బందిపై పనిభారం పెరిగింది. అద్దె భవనంలో కొనసాగుతున్న ఈ ఆరోగ్య కేంద్రానికి కరోనా పరీక్షల కోసం, చికిత్సకు వచ్చే పేషంట్ సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. పేర్ల నమోదు కోసం వచ్చి... సిబ్బంది తక్కువగా ఉండటె వల్ల తమ వంతు రాకుండానే బాధితులు వెనక్కి వెళ్లిపోతున్నారు. దాదాపు నగరంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్ద ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇలాగే కొనసాగితే.. బాధితులు, అనుమానితుల వల్ల కరోనా కేసులు ఉధృతంగా పెరిగే ప్రమాదం ఉంది.
పోస్టుల భర్తీ ఎప్పుడు?
భోలక్‌పూర్ పట్ట్ణణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనే ముషీరాబాద్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కూడా కొనసాగుతున్నది. ముషీరాబాద్ యూహెచ్‌సీలో ఎనిమిది పోస్టులకు మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో కీలకమైన పూర్తిస్థాయి వైద్యాధికారి కూడా లేడు. ఈ కేంద్రాన్ని ఇంఛార్జి వైద్యాధికారితోనే నెట్టుకొస్తున్నారు. ఒప్పంద వైద్యుడితో ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నడిపిస్తున్నారు. భోలక్ పూర్ ప్రాథమిక కేంద్రంలో సైతం 12 పోస్టులకు మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో అతిముఖ్యమైన ఫార్మాసిస్ట్ పోస్టు ఖాళీగా ఉంది.
బాధితులకు సరిపడా కేంద్రాలేవి?
ఈ లెక్కన చూసుకుంటే.. గ్రేటర్ పరిధిలో సుమారు 85 పట్టణ ఆరోగ్య కేంద్రాలున్నాయి. ప్రతి 50వేల మందికి ఒక అర్బన్ ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలి. కానీ...హైదరాబాద్ పరిధిలో సుమారు 75వేల నుంచి లక్ష మందికి ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది. ఆయా ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సిబ్బంది కూడా తక్కువగా ఉన్నారు. 85 యూపీహెచ్‌సీలలో కలిపి 72 మంది వైద్యులు ఉన్నారు. కరోనా విస్తరిస్తున్న పరిస్థితుల్లో మరో 61 మంది సిబ్బందిని నియమించాలనుకున్నారు. కానీ..ఇప్పటి వరకు విధుల్లో చేరింది కేవలం 44 మంది మాత్రమే.
ప్రత్యేక సిబ్బంది అవసరమే..
హైదరాబాద్ జిల్లాలో ఒప్పంద వైద్యుల నియామకం ప్రస్తుతం కొనసాగుతుందని ముఖ్య అధికారులు చెప్తున్నా.. ఎక్కువ భాగం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కలిపి 420 మంది ఏఎన్ఎంలు ఉన్నారు. మరో 284 మంది ఏఎన్ఎంలను నియమించాలని అనుకున్నప్పటికీ.. 61 మంది మాత్రమే విధుల్లో చేరారు. ప్రస్తుత పరిస్థితుల్లో సీజనల్ వ్యాధులు ఎక్కువగా వ్యాపిస్తాయి. వీటిని నిరోధించాలంటే యూపీహెచ్‌సీలో సిబ్బందిని పెంచాలి. చిన్నారులకు వేసే వ్యాక్సినేషన్‌కు , గర్భినీలకు ప్రత్యేకమైన సిబ్బందిని కేటాయించాలని నగరవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. లేకుంటే చిన్నారులకు కరోనా సోకే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో అంతకంతకూ విజృంభిస్తున్న కరోనా