రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తున్న నర్సులకు అదనపు మార్కులు(వెయిటేజీ) కేటాయించే ప్రక్రియ తప్పుల తడకగా మారిందని స్టాఫ్ నర్సులు ఆందోళనకు దిగారు. తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ... నాంపల్లిలోని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.
గతంలో వెయిటేజీ కేటాయింపులో తప్పులు దొర్లినట్లు నిర్ధరణ జరిగిందని తెలిపారు. నెల రోజుల కసరత్తు అనంతరం తిరిగి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కి సమర్పించిన జాబితాలోనూ తప్పులు పునరావృతమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు అధికారులు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఒప్పంద నర్సులతో పాటు పొరుగుసేవల్లో పనిచేస్తున్న నర్సులకూ వెయిటేజీ ఇచ్చినట్లుగా తేలిందని... మరికొందరు తప్పుడు ధ్రువపత్రాలు పెట్టి అదనపు మార్కులను పొందారనీ నిర్ధరణ అయిందని పేర్కొన్నారు. అక్రమాలకు పాల్పడిన వైద్యశాఖ అధికారులపై చర్యలుకొని... సమగ్ర విచారణ జరిపి... అర్హులకు న్యాయం చేయాలని కోరారు.
ఇదీ చూడండి: కాల్వల్లో కన్నీటి వరద.. భద్రత లేక బలైపోతున్న ప్రాణాలు