గిరిజనులకు రాజ్యాంగబద్ధంగా కల్పించిన హక్కులను కొనసాగించాలని తెలంగాణ ఢాడి లంబాడీ హక్కుల సాధన సమితి డిమాండ్ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లంబాడీ ఉప కులమైన ఢాడి కులస్తులు విద్య, ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో వెనుకబడి ఉన్నారని సమితి రాష్ట్ర అధ్యక్షుడు రుడవత్ రఘు నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ లక్డీకపూల్లో నిర్వహించిన సమితి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో జిల్లాలు, వివిధ రాష్ట్రాల నుంచి నాయకులు పాల్గొన్నారు.
ఢాడి ఉప వర్గాన్ని గుర్తించి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా సహకారం అందించాలని... తమపై జరుగుతున్న దాడులను నిరోధించి రక్షణ కల్పించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల రిజర్వేషన్ శాతాన్ని 6 నుంచి 12 శాతానికి పెంచాలని... సుప్రీంకోర్టు కొట్టివేసిన జీవో నం.3పై ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేసి... గిరిజనులకు వంద శాతం ఫలాలు దక్కేలా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గ ఉద్యోగులపై అధికార పార్టీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించిన ఆయన... ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తున్న ఢాడి కులస్థులందరినీ ఏకతాటిపైకి తెచ్చి... హక్కులను సాధించేందుకు పోరాటాలు చేస్తామని అన్నారు. కనుమరుగైన ఢాడిల చరిత్రను వెలికి తీసి సమాజానికి అందించే దిశగా కృషి చేస్తామని వారు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: పల్లెప్రగతి పరిమళిస్తోంది.. అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది