SSC paper leakage issue in Telangana : పదో తరగతి పరీక్షల విధుల్లో అక్రమాలకు పాల్పడి నిర్లక్ష్యం వహించిన వారిపై విద్యాశాఖ కఠిన చర్యలు తీసుకుంది. ముగ్గురు ఉపాధ్యాయులను ఉద్యోగాల నుంచి శాశ్వతంగా తొలగించింది. మరో ఇద్దరిపై సస్పెన్షన్ వేటు వేసింది. వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. ఈ మేరకు పాఠాశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన ప్రకటన జారీచేశారు.
ఉద్యోగాల నుంచి శాశ్వతంగా తొలగింపు: వికారాబాద్ జిల్లా తాండూర్‌లో తెలుగు ప్రశ్నాపత్రాన్ని ఫొటో తీసిన ఇన్విజిలేటర్ బందెప్ప.. దానిని స్వీకరించిన ఉపాధ్యాయుడు సమ్మప్ప ఇద్దరూ అక్రమాలకు పాల్పడినట్లు తేలడంతో వారిని ఉద్యోగాల నుంచి శాశ్వతంగా తొలగించారు. హనుమకొండ కమలాపూర్‌లో పరీక్ష రాస్తున్న విద్యార్థి హిందీ ప్రశ్నాపత్రాన్ని మరో బాలుడు కిటికీ నుంచి తీసుకుని ఫొటో తీసుకున్నా గుర్తించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఇన్విజిలేటర్ సబియా మదహత్ సర్వీసు నుంచి తొలగించారు. చీఫ్ సూపరింటెండెంట్ ఎం. శివప్రసాద్, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్ టి. శ్రీధర్‌ను సస్పెండ్ చేశారు. వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ సంచాలకురాలు తెలిపారు. ప్రశ్నాపత్రం ఇచ్చిన విద్యార్థిని ఐదేళ్లపాటు పరీక్ష రాయకుండా డీబార్ చేసింది.
పూర్తి నిఘా పెట్టిన అధికారులు: రెండురోజుల పాటు పరీక్ష పేపర్లు వాట్సాప్‌లో బయటకు రావడంతో రెవెన్యూ, పోలీసు శాఖలు పూర్తిస్థాయిలో దృష్టి సారించనున్నాయి. కమలాపూర్ జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో హిందీ ప్రశ్నాపత్రం బయటకు వచ్చిన ఘటనలో లోపాలు స్పష్టంగా బయటపడ్డాయి. హాల్‌టికెట్ లేకుండా బయటి వ్యక్తి పరీక్షా కేంద్రం లోపలికి రావడం, చెట్టు ఎక్కినా గమనించకపోవడంతో పర్యవేక్షణ డొల్లతనం కనిపిస్తోంది.
తొలిరోజు వికారాబాద్‌లో తెలుగు ప్రశ్నాపత్రం బయటకు వచ్చినా పటిష్ఠ నిఘా ఏర్పాటు చేయకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో , పోలీసు, విద్యాశాఖల ఉన్నతాధికారులు, కలెక్టర్లతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పరీక్షల నిర్వహణలో కఠింగా వ్యవహరించాలని ఆదేశించారు. ఒక్కో తహశీల్దార్‌కు కొన్ని పరీక్షా కేంద్రాల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగిస్తారు. ఆర్డీవోలు కూడా బాధ్యతలు తీసుకుంటారు. ఇంటర్ పరీక్షలు కూడా పూర్తయినందున పూర్తిస్థాయిలో పోలీసులను మోహరించనున్నారు. ఎస్ఐ, సీఐలతో పెట్రోలింగ్ పెంచడంతో పాటు 144 సెక్షన్‌ను పకడ్బందీగా అమలు చేయనున్నారు.
పేపర్ల లీకేజీ: పది పరీక్షలు ప్రారంభమైన కొద్ది సమయంలోనే పేపర్ల లీకేజీల హవా హోరెత్తింది. మొదటి రోజే పేపరు లీకేజీకి గురి కావడం కలకలం రేపుతోంది. వాట్సాప్‌ల ద్వారా పరీక్ష ప్రశ్నా పత్రాలు బయటకు వెళ్లడం వల్ల ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తెలుగు, హిందీ పేపర్లు లీకేజీకి గురికావడం వల్ల ఆందోళన పరిస్థితి నెలకొంది. పరీక్ష నిర్వహణ లోపం స్పష్టంగా కనిపిస్తోందని నాయకులు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు.
ఇవీ చదవండి: