తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సర్వదర్శనం టోకెన్లు పొందేందుకు పలు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తిరుపతి తరలివస్తున్నారు. క్యూలైన్లలో నిల్చొని టోకెన్లు పొందినా 4 రోజుల తర్వాతే దర్శనానికి అవకాశం ఇస్తుండటంతో తప్పనిసరై వేచి ఉండాల్సి వస్తోంది. అన్ని రోజులు ఉండలేక.. స్వామి దర్శనం కాకుండా వెనుదిరగలేక తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. కరోనా తగ్గడంతో తిరుపతిలోని 3 కేంద్రాల్లో రోజుకు పదిహేను వేల చొప్పున సర్వదర్శన టోకెన్లను తితిదే జారీ చేస్తోంది. మొదట పేర్కొన్న ప్రకారం తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లు తీసుకొని తర్వాత రోజు శ్రీవారిని దర్శించుకొని వెంటనే వెళ్లిపోవచ్చన్న భావనతో భక్తులు వస్తున్నారు. ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. 4 రోజుల తర్వాత దర్శనం చేసుకోవాల్సి రావడంతో సరైన వసతి సౌకర్యాలు లేక అల్లాడుతున్నారు. కరోనా తీవ్రత దృష్ట్యా తిరుపతిలో కొన్ని వసతిగృహాలు మూసివేయగా.. మరికొన్ని కొవిడ్ కేర్ కేంద్రాలుగా మారాయి. తిరుపతి విష్ణునివాసాన్ని కొవిడ్ కేర్ కేంద్రంగా వినియోగిస్తుండగా.. శ్రీనివాసం, గోవిందరాజస్వామి సత్రాలనే భక్తులకు అందుబాటులోకి తెచ్చారు. భూదేవి కాంప్లెక్స్‌లోని వసతి గదులను భక్తులకు కేటాయించడం లేదు. టోకెన్‌లు ఉన్న భక్తులను దర్శన సమయానికి 12 గంటల ముందు తిరుమలకు అనుమతిస్తుండటంతో అలిపిరి సమీపంలోని భూదేవి కాంప్లెక్స్ దగ్గర చెట్ల కింద ఉంటూ ఇబ్బందులు పడుతున్నారు. అన్నప్రసాద పంపిణీ లేకపోవడంతో రూ.వందలు ఖర్చు పెట్టి హోటళ్లలో తినలేక పాత్రలు తెచ్చుకొని వంట చేసుకొంటూ కాలం వెళ్లదీస్తున్నారు.
ఒక్కొక్కరిదీ ఒక్కో బాధ
శనివారం రాత్రి క్యూలైన్లో నిల్చుంటే 24వ తేదీ దర్శనం టికెట్లు దొరికాయని, 3 రోజులు ఇక్కడే ఉండాలని, ఆరు బయట పిల్లలతో ఇబ్బంది పడుతున్నామని తెచ్చుకున్న డబ్బు ఖర్చులకే అయిపోతోందని కర్ణాటకలోని చిత్రదుర్గకు చెందిన హనుమంత రాయుడు వాపోయారు. ‘24వ తేదీకి దర్శన టికెట్ ఇచ్చారు. హోటళ్లలో ఒకపూట భోజనానికి రూ.వెయ్యి, రూ.పన్నెండు వందలు ఖర్చు పెట్టలేక సామగ్రి తెచ్చుకుని వండుకొని తింటున్నాం’ అని కడపజిల్లా వేంపల్లె వాసి గాయత్రి చెప్పారు. ‘చిన్నపిల్లలతో కలిపి పదిహేను మందిమి శుక్రవారం రాత్రి ఇక్కడికి చేరుకున్నాం. దర్శనం టికెట్ మంగళవారానికి దొరికింది. హోటల్‌లో గదికి రూ.12 వేలు అడిగారు. అంతడబ్బు లేక చెట్ల కింద పడుకొంటున్నాం. రాత్రి పూట మేం నిద్రపోతుంటే మా కుటుంబంలోని మగవారు దొంగల భయంతో కాపలా ఉంటున్నారు’ అని హోసూరుకు చెందిన మునిరత్నమ్మ తెలిపారు.
ఇదీ చూడండి: ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం.. ప్రకాశ్‌రాజ్‌కు రాజ్యసభ సీటు?