శ్రీశైలం భూగర్భ జలవిద్యుత్ కేంద్రానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రాజక్టులోని నీటిని వాడి కరెంట్ఉత్పత్తి చేయడమే కాకుండా ఆ నీటిని మళ్లీ జలాశయంలోకి పంప్ చేయగలదు. వేసవిలో శ్రీశైలంలో నీళ్లు లేని సమయంలో ఈ విధానం ఎంతో పయోగపడుతుంది. కానీ, 2017 నుంచి....... ఆ విధానంలో విద్యుత్ ఉత్పత్తి సక్రమంగా జరగట్లేదు. ఈతరహా విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన నిర్మాణం దెబ్బతినడమే అందుకు కారణం. శ్రీశైలం ప్రాజెక్టుకు సుమారు 14 కిలోమీటర్ల దూరంలో... రెండు కొండల నడుమ నదికి అడ్డంగా చిన్నఆనకట్ట నిర్మించారు. ఎగువ నుంచి వచ్చే వరద నీటిని కావాల్సిన నిర్ణీత మొత్తంలో ఒడిసి పట్టేందుకు నదికి అడ్డంగా నిర్మించే ఆనకట్టనే వియర్ లేదా వేర్ అంటారు. సుమారు రెండు టీఎంసీ సామర్థ్యంతో టెయిల్ పాండ్ నిర్మించాలని 2001లో నిర్ణయించారు. 323 మీటర్ల పొడవు, 172 మీటర్ల ఎత్తు, 132 మీటర్ల బెడ్తో 92 కోట్ల అంచనాగా నిర్ధరించారు. 2004లో అటవీశాఖ నుంచి అనుమతులు వచ్చాయి. పూర్తయ్యే దశలో వరదలొచ్చి ఆనకట్ట కొట్టుకుపోయింది. 2015లో పనులు పూర్తి చేశారు. రెండేళ్ల పాటు విద్యుత్ ఉత్పత్తికి వినియోగించారు. 2017లో మళ్లీ టెయిల్పాండ్ దెబ్బతినగా విద్యుత్ ఉత్పత్తికి పనికి రాకుండా పోయింది. అప్పటి నుంచి రివర్సబుల్ పంపింగ్ ద్వారా.. కరెంట్ఉత్పత్తి సక్రమంగా జరగడం లేదు.
శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం అట్టడుగు స్థాయికి చేరినప్పుడు పవర్‌హౌజ్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు నదిలోకి నీరు విడుదల చేసే అవకాశం ఉండదు. అలాంటప్పుడు శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రం సొరంగ మార్గం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. అలా విడుదలైన నీళ్లు 10 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటాయి. నదిలోంచిదిగువకు నీళ్లు వెళ్లిపోకుండా వియర్ ఆనకట్టగా పనిచేస్తుంది. తద్వారా సుమారు 2 టీఎంసీల నీళ్లు టెయిల్ పాండ్‌లో నిల్వ ఉంటాయి. డిమాండ్ లేని సమయంలో టెయిల్పాండ్లో ఉన్న నీటిని తిరిగి జలాశయంలోకి పంప్చేస్తారు. మళ్లీ విద్యుత్‌కు డిమాండ్ పెరిగితే.. జలశాయం నుంచి దిగువకు నీళ్లు విడుదల చేసి కరెంట్ ఉత్పత్తి చేస్తారు. ఈ విధానం వల్ల జలశయంలో నీళ్లు ఖర్చు కావు.
ప్రస్తుతం టెయిల్ పాండ్ దెబ్బతినడం వల్ల రెండేళ్లుగా.. రివర్సబుల్ పంపింగ్‌తో విద్యుత్ ఉత్పత్తి సక్రమంగా జరగట్లేదు. నాగార్జునసాగర్లో 540 ఎడుగుల ఎత్తులో నీళ్లు ఉన్నప్పుడు.. టెయిల్పాండ్ వద్ద తిరుగుజలాలు అందుబాటులో ఉంటాయి. అప్పుడే వాటిని వినియోగించుకుని రివర్సబుల్ పంపింగ్ ద్వారా కరెంట్ఉత్పత్తి జరుగుతుంది. కృష్ణానదికి వరద ఉండి సాగర్ నిండినప్పుడే అది సాధ్యపడుతుంది. శ్రీశైలం జలాశయంలో నీళ్లు లేని సమయం.. జనవరి నుంచి జూన్ వరకు.. రివర్సబుల్ పంపింగ్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి జరగట్లేదు. జెన్కో ఏటా కోట్లల్లో నష్టపోతోందని నిపుణులు అంచనా వేశారు. ఆనకట్ట ఎక్కడికక్కడ దెబ్బతినడంతోనే ఈ దుస్థితి నెలకొంది.
ఎట్టకేలకు టెయిల్ పాండ్ మరమ్మతులపై జెన్కో యంత్రాంగం దృష్టి సారించింది. ఇటీవల శ్రీశైలం జల విద్యుత్ కేంద్రానికి వచ్చిన సీఎండీ ప్రభాకర్‌రావు వీలైనంత త్వరగా టెయిల్పాండ్ పునరుద్దరణపై నివేదిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.