Srinivas Goud Visit Neera Cafe: కులవృత్తులను అవహేళన చేసిన వారిని... కుల వృత్తులను లేకుండా చేయాలని చాలా మంది భావించినట్లు సాంస్కృతిక, పర్యాటక, అబార్కీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. వారిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గత ప్రభుత్వాలు, కొందరు వ్యక్తులు రాష్ట్రంలో కుల వృత్తులేకుండా చేయాలని ఎన్నో కుతంత్రాలు చేశారని ధ్వజమెత్తారు. కులవృత్తి కార్మికులను భయపెట్టాలని చూస్తున్నవారు... ఏ పార్టీ వారైనా సహించేది లేదని హెచ్చరించారు.
కుల వృత్తులకు ప్రాధాన్యం: రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడ లేని విధంగా కులవృత్తులకు ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లో గీతకార్మికులను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేస్తున్న నీరా కేఫ్ పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా నీరా కేఫ్ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నీరా పానీయాలను శాస్త్రీయంగా అధ్యయనం చేసి... దాని వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయనే అనే విషయాలను ప్రజలకు వివరిస్తామని మంత్రి తెలిపారు.
వారికి బుద్ధి చెబుతాం: కొందరు కులాలను, కులవృత్తి కార్మికులను అవమానించే విధంగా అహంకారంతో మాట్లాడుతున్నారని... అలాంటి వారికి తగిన విధంగా బుద్ధి చెబుతామన్నారు. రాష్ట్రంలో కులవృత్తుల వారి ఆత్మ గౌరవం కోసం భవనాలు కడుతున్నట్లు మంత్రి చెప్పారు. కల్లు, నీరా అంటే అవమానిస్తున్నారని... నీరా తాగితే అనేక రోగాలు నయమవుతాయన్నారు. గత ప్రభుత్వం హైదరాబాద్‌లో కల్లు నిషేధించిందని... తెరాస ప్రభుత్వం వచ్చిన తరువాత తిరిగి కుల వృత్తులను ప్రోత్సహిస్తోందన్నారు.
కులవృత్తులను, కార్మికులను అవహేళన చేస్తే సహించేది లేదు. దేశంలో ఎక్కడా లేనివిధంగా కులవృత్తులకు అధిక ప్రాధాన్యమిస్తున్నాం. గీత కార్మికులకు బీమా సౌకార్యం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం. కులవృత్తుల వారి ఆత్మగౌరవం కోసం భవనలు నిర్మిస్తున్నాం. నీరా తాగితే అనేక రోగాలు నయమవుతాయి. నీరాపై శాస్త్రీయ పరిశోధన చేసి ప్రజలకు వివరిస్తాం. ఎదిగిన నాయకత్వాన్ని అణచివేయాలని చూస్తే గుణపాఠం చెబుతాం.
-- శ్రీనివాస్ గౌడ్, మంత్రి