శుభముహూర్తం కుదిరింది.. పెళ్లిసందడి మొదలైంది. శ్రావణమాసం కళ్యాణవేదికలు కళకళలాడుతున్నాయి. ఇప్పటి వరకూ వాయిదా వేస్తూ వచ్చిన వివాహాలు జరిపేందుకు పెద్దలు సిద్ధమయ్యారు. ఈ నెల 17 నుంచి 22వ తేదీ వరకూ పెద్దఎత్తున జంటలు ఒక్కటి కాబోతున్నారు. ఇంతకు ముందు కరోనా మహమ్మారితో వేడుకలు జరిపేందుకు కొందరు సాహసించలేకపోయారు. కొవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తుండటంతో వెనుకంజ వేశారు. క్రమంగా కేసులు తగ్గుముఖం పట్టడం.. టీకా వేసుకున్నామనే ఉద్దేశంతో ధైర్యం చేస్తున్నారు. ఈ ఏడాది మేలోనే చాలా వివాహాలు జరగాల్సి ఉంది. అప్పుడు కరోనా ఉద్ధృతంగా ఉండటంతో ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో ముహూర్తాలు ఖరారు చేసుకున్నారు. పెళ్లిసంబంధం కుదుర్చుకున్నాక ఎక్కువ కాలం ఆగకూడదనే వధూవరుల ఆలోచన కూడా మరో కారణమని పురోహితులు యనమదల రాజేశ్‌శర్మ చెబుతున్నారు.
ఎన్నాళ్లకెన్నాళ్లకు..
అబ్బాయి అమెరికా.. అమ్మాయి చందానగర్‌లో ఉన్నారు. ఆన్‌లైన్ ద్వారా పెళ్లిచూపులు జరిగాయి. మూడుసార్లు వివాహం వాయిదా వేశారు. ఈ నెల 21 రాత్రి 7 గంటలకు ఆ జంట పెళ్లిపీటలు ఎక్కబోతుంది. పిల్లల కోరిక మేరకు వారంరోజుల పాటు విందు, వినోద కార్యక్రమాలు నిర్వహించనున్నామని చెబుతున్నారు చందానగర్‌కు చెందిన గోవర్దన్. ఏడాదిన్నర తరువాత ఎక్కువ వివాహాలు జరిపేందుకు తమకు ఆర్డర్స్ వచ్చాయంటూ జూబ్లీహిల్స్‌కు చెందిన ఈవెంట్ నిర్వాహకుడు ప్రదీప్ తెలిపారు. బడ్జెట్‌కు తగినట్టుగా శుభకార్యాలు నిర్వహించేందుకు పెద్దలు ఆసక్తి చూపుతున్నట్టు వివరించారు. ఈ నెల 17, 18, 20, 21, 22, 25, 26 వరకూ పగలు, రాత్రి వివాహాలున్నాయి. సెప్టెంబరు నుంచి అక్టోబరు 7 వరకూ శుభముహూర్తాలు లేకపోవటంతో వివాహాలు, గృహప్రవేశాలను పూర్తిచేస్తున్నారని వేదపండితులు పవన్ కుమార్ తెలిపారు. చాన్నాళ్ల తరువాత అవకాశాలు రావటంతో కాస్త తక్కువ ధరకైనా అంగీకరిస్తున్నామని ఈవెంట్ నిర్వాహకులు తెలిపారు.
ఉన్నంతలో చేసేద్దాం..
గతంతో పోల్చితే పెళ్లింట చాలా మార్పు కనిపిస్తోంది. విందులు, వినోదాలకు ఆర్భాటం చేయకుండా పొదుపు పాటిస్తున్నారు. మున్ముందు పరిస్థితులు ఎలా ఉంటాయనే ముందుచూపు కూడా దీనికి కారణమంటున్నారు ఈవెంట్ నిర్వాహకులు. 200-300 లోపు మాత్రమే భోజనాలు చెబుతున్నారు. పెళ్లిచూపుల తరువాత సెల్‌ఫోన్ ముచ్చట్లు, స్నేహితులతో పార్టీలకు వెళ్లిన సందర్భాల్లో ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటున్నారు. అక్కడ ఏ మాత్రం ప్రతికూలత కనిపించినా పెళ్లి రద్దు చేసుకుంటున్నారని వివాహ పరిచయ వేదిక నిర్వాహకుడు సత్యనారాయణ తెలిపారు.
ఇదీ చూడండి: HEAVY RAINS: రాష్ట్రంలో నేడూ రేపూ అతి భారీ వర్షాలు