ఆ అమ్మాయికి తొమ్మిదేళ్లున్నప్పుడే అండాశయ(ఓవరీయన్) క్యాన్సర్ బారిన పడింది. చూస్తుండగానే జబ్బు ముదిరిపోయింది. ఈ విషయం తనకు తెలియకుండా తల్లిదండ్రులు జాగ్రత్తపడ్డారు. కీమోథెరపీ చికిత్స కోసం ఆపరేషన్ గదిలోకి వెళ్లిన తరువాతే క్యాన్సర్ అని తెలుసుకుందామె. జబ్బు గురించి తెలుసుకుని భయపడలేదు. మనోధైర్యంతో చికిత్సకు వెళ్లింది. మూడేళ్లపాటు సర్జరీలు, కీమోథెరపీలు చేసిన తరువాత పూర్తిగా శివానీకి కోలుకుంది.
క్యాన్సర్ జయించినా.. అదే ఆందోళన
క్యాన్సర్‌ను జయించినా, అంతకు ముందులా ఉత్సాహంగా ఉండేది కాదు. మనసులో ఏవేవో ఆలోచనలతో ఎప్పుడూ ఆందోళనతో కనిపించేది. ఈ క్రమంలో తన మనసు మళ్లించడానికి స్పోర్ట్ క్లైంబింగ్ ఆటను ఆమెకు పరిచయం చేశారు తల్లిదండ్రులు. అప్పటికే శివానీ అక్క శిల్ప ఈ ఆట నేర్చుకుంది. వైద్యుల అనుమతితో ఆటకు చేరువైన ఆమె.. అక్కతో కలిసి ఆడుతూ ఆటలో పతకాలు సాధించే స్థాయికి ఎదిగింది.
మొదటి నుంచీ మేటి
స్కూల్ గేమ్స్ పోటీల్లో మొదటిసారి పాల్గొన్న శివానీ, రజతం గెలుచుకుంది. ఇదే విభాగంలో పోటీలో నిలిచిన తన అక్క శిల్ప స్వర్ణం సాధించింది. సరైన వసతులు లేకపోయినా ఆటపై పట్టు సాధించిన వీరిద్దరూ.. టోర్నమెంట్లు, జిల్లాస్థాయి పోటీలు, జోన్ స్థాయి పోటీల్లో సత్తా చూపిస్తూ ర్యాంకుల్లో దూసుకుపోయారు. జనవరి ఆరు నుంచి పది వరకు భువనేశ్వర్‌లో జరిగిన 25వ నేషనల్ స్పోర్ట్ క్లైంబింగ్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో స్పీడ్ క్లైంబింగ్, బౌల్డరింగ్ విభాగాల్లో స్వర్ణం, లీడ్ క్లైంబింగ్ విభాగంలో రజతం సాధించింది శివానీ. ప్రస్తుతం ఈ ఆటలో దేశంలోనే మొదటి ర్యాంకులో కొనసాగుతోందామె. ఈ పోటీల్లో, జూనియర్ విభాగంలో ఆమె తమ్ముళ్లు అరుణ్ రెండు రజతాలు, అజయ్ కాంస్యం సాధించడం విశేషం. ‘ఆటకు సరిపోయే ఫిట్‌నెస్ పాఠాలను యూట్యూబ్‌లో చూసి నేర్చుకుంటున్నట్లు తెలిపిన శివానీ... ఆటలో ఎంత ఎదిగినా స్పాన్సర్లు లేక అంతర్జాతీయ పోటీలకు దూరమవుతోంది.
ఒలింపిక్స్‌పై గురి
స్పోర్ట్ క్లైంబింగ్‌ను కొత్తగా ఒలింపిక్స్‌లో చేర్చారు. ఐఎఫ్‌ఎస్‌సీ ఆసియన్ ఛాంపియన్‌షిప్ పోటీలు ఈ ఏప్రిల్‌లో చైనాలో జరగనున్నాయి. అక్కడ విజయం సాధిస్తే.. శివానీకి ఒలింపిక్స్‌లో ఆడే అవకాశం దక్కుతుంది. 'స్పోర్ట్ క్లైంబింగ్ ఆటగాళ్లు వాడే బూట్లు ఖరీదైనవి. ప్రాక్టీస్ చేసేవారు ప్రతి నెలా కొత్తవి కొనాల్సిందే. మాకు అంత ఆర్థిక స్థోమత లేదు. అందుకే చిరిగిన బూట్లతోనే ఆడుతున్నా. అవరోధాలను అధిగమించడం నాకు చిన్నప్పటి నుంచీ అలవాటే. అదే స్ఫూర్తితో ఒలింపిక్స్‌లో దేశానికి పతకం సాధిస్తాననే నమ్మకం ఉంది' అని చెబుతోంది.
ఇవీ చూడండి: ప్రైవేటు ఆస్పత్రికి కరోనా సోకిన ఇటలీ పర్యటకులు