అబ్బాయి ప్రశాంత్.. అమ్మాయి రితీష. ఇద్దరి పేర్లను ఒక్కటిగా చేసి ప్రతీషగా మార్చారు. మేమిద్దరం ఒక్కరమనే అభిప్రాయాన్ని పంచుకోవటమే దీని ముఖ్యోద్దేశమంటారీ జంట. కూకట్‌పల్లిలో ఉంటున్న ప్రవీణ్.. సృజన పెళ్లి వేడుక వేదికపై కనిపించిన అక్షరాలు అతిథులను ఆకట్టుకున్నాయి. ‘ప్రజన’. కాబోయే దంపతులు పేర్లలోని అక్షరాలతో ముద్దుపేరును మలచుకోవటం ట్రెండీగా మారిందన్నాడు ప్రవీణ్.
మణికొండకు చెందిన ఓ జంట ఏడాదిగా కుమారుడికి మంచి పేరు కోసం వెతుకుతూనే ఉంది. చివరకు సహోద్యోగి సూచన మేరకు తండ్రి విజయరావు నుంచి జయ.. తల్లి ప్రదీప్తి నుంచి దీప్‌ను తీసుకుని ‘జయదీప్’కి రూపమిచ్చారు. వారసుడిలో తల్లిదండ్రుల పేర్లను చేర్చడాన్ని ఆస్వాదిస్తామని విజయరావు తెలిపారు. ప్రయివేటు ఉద్యోగి నవీన్.. కూతురుకి తల్లి రమాదేవి, తండ్రి రాజు పేర్ల నుంచి అక్షరాలతో రియారాజ్‌గా నామకరణం చేశానంటారు. కానీ కుమారుడి పేరు కోసం 9 నెలలు వెతికారు. కొడుకులో కుటుంబాన్ని చూసుకోవాలనే ఆలోచనతో భార్య స్వప్న, తల్లిదండ్రులు, అత్త ఐదుగురు పేర్లలోని అక్షరాలతో స్వనవ్ అన్షరామ్‌గా నామకరణం చేయటం సంతోషంగా ఉందని నవీన్ చెప్పారు.
విభిన్నం.. వినూత్నం
ఏది చేసినా భిన్నంగా, వినూత్నంగా ఉండాలనే అభిప్రాయంతో యువతరం తమ అంతరంగాన్ని పంచుకునేందుకు ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని మనస్తత్వ విశ్లేషకులు రాంచందర్ చెప్పారు. గతంలో పిల్లలకు తమ పూర్వీకుల పేర్లను నామకరణం చేసేవారు. ప్రస్తుతం విభిన్నంగా ఉండేందుకు తమ పిల్లలకు కొత్త తరహా పేర్ల కోసం వెతుకుతున్నారు. అధికశాతం భార్యభర్తలు తాము పెళ్లిరోజు రాసుకున్న కొత్తపేరుకే జై కొడుతున్నారు. వీలుకుదరకుంటే.. తమ కుటుంబ సభ్యుల్లో ఇష్టమైన వారి పేర్లలోని అక్షరాలను తీసుకుని నామకరణం చేస్తున్నారు.
పెళ్లిలో, పిల్లలకూ..
ఏదైనా కొత్తగా అనిపించాలి. సృజనాత్మకత కనిపించాలి.. ఇదీ ఇప్పటి యువత ఆలోచన. పెళ్లిపీటలెక్కినా.. పిల్లలకు పేరు పెట్టాలన్నా నూతనత్వం కోసం ప్రయత్నిస్తున్నారు. ఒకప్పుడు సినీ, రాజకీయ, క్రీడారంగ ప్రముఖులకే పరిమితమైన ట్రెండ్ ఇప్పుడు సాధారణంగా మారింది. ఇప్పటి వరకూ కాబోయే వధూవరుల ఇద్దరి పేర్లను వివాహ వేడుక వద్ద అందంగా రాసేవారు. ప్రస్తుతం ఇద్దరి పేర్లలోని చెరోసగం అక్షరాలను వేరు చేసి కొత్త పేరుకు రూపమిస్తున్నారు. జీవితాన్ని పంచుకోబోయే ఇద్దరి ఆలోచనలు, అభిప్రాయాలు కూడా ఒక్కటిగా ఉండాలనే భావన కూడా అంతర్లీనంగా ఉందంటారు వేదపండితులు బలరామ్. ప్రపంచానికి పరిచయం చేసిన ఆ కొత్త పేరును తమకు పుట్టబోయే పిల్లల కోసం దాచుకుంటున్న జంటలను తాను గమనించానంటూ తన అనుభవాన్ని వివరించారు.
ఇదీ చూడండి : మరో 9 వేల పోస్టుల భర్తీ... కార్పొరేషన్లు, సొసైటీల్లోనూ నియమాకాలు...!