నిజాం కాలంలో 20 ఎకరాల పైచిలుకు విస్తరించిన అల్వాల్ చెరువు.. ఇప్పుడు తొమ్మిదెకరాలకు పరిమితమైపోయింది. మానవ నిర్మితమైన ఈ చెరువు.. ఒకప్పుడు పశువులు, పక్షులకు ఆవాసంగా.. తాగునీటి అవసరాలు తీర్చే కల్పతరువుగా ఉండేది. ఇప్పుడు తన ప్రాశస్త్యాన్ని, ప్రభావాన్ని క్రమంగా కోల్పోతూ వస్తోంది. గృహ సంబంధ వ్యర్థాలు, కాలుష్యకారకాలు పెరిగి.. చెరువు మొత్తం మురికికూపంగా మారిపోయింది. వినాయక విగ్రహాలు, బతుకమ్మల నిమజ్జనాలతో.. చెరువు మొత్తం కాలుష్యకాసారంగా రూపాంతరం చెందింది.
మురికి కూపంగా మారుతోంది..
చెరువును ఆనుకొని వెలిసిన కాలనీలు.. యథేచ్చగా మురుగునీటిని చెరువులోకి డంప్ చేస్తున్నాయి. దాదాపు 25 కాలనీలు డ్రైనేజీ మురుగు.. నిరంతరంగా మళ్లించగా చెరువు దుర్గంధమవుతోంది. దీనికి తోడు ఎక్కడికక్కడ చెత్తకుప్పలు, పెంట కుప్పలు.. చుట్టూ వెలిసి దుర్వాసన వెలువడుతోంది. చెరువు చెత్తకుండీలా మారిపోగా.. పరివాహక ప్రాంతంలోని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పేరుకుపోయిన గుర్రపు డెక్క తొలగించి.. పూడిక తీయటంలో అధికారులు ఉదాసీనత ప్రదర్శిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. చెరువులోనికి మురుగు వదలకుండా వెంటనే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
ఇప్పటికైనా స్పందించండి..
చెరువుకు ప్రధాన సమస్యగా ఉన్న డ్రైనేజీ నీరు.. తటాకంలోకి మళ్లకుండా ఉండేందుకు జేఎన్ఎన్యూఆర్ఎం పథకం కింద... సమగ్ర మురుగు నీటి వ్యవస్థను అధికారులు ప్రతిపాదించారు. అది ఇప్పటివరకు ఆచరణకు నోచుకోలేదు. ఆక్రమణలను నియంత్రించేందుకు చెరువు చుట్టూ వేసిన కంచెను దుండగులు ధ్వంసం చేశారు. భారీ వర్షాలు కురిసినప్పుడు... మత్తడి దూకుతూ లోతట్టు ప్రాంతాలను ముంచెత్తుతున్నా అక్రమార్కులకు పట్టడం లేదు. ఎఫ్టీఎల్ నిర్ణయించి.. చెరువు చుట్టూ కంచె ఏర్పాటు చేయాలని.. కట్టను పటిష్ఠం చేసి బఫర్ జోన్ పరిధిని గుర్తించాలని స్థానికులు కోరుతున్నారు.
ఇదీ చూడండి: ధరణి పోర్టల్లో రిజిస్ట్రేషన్ ఇలా చేసుకోండి...