చిన్నప్పటి నుంచి క్రీడలంటే ఎక్కువ ఇష్టం అనితా కుందూకి. ఈమెలోని క్రీడాస్ఫూర్తి చూసి తండ్రి అదే రంగంలో మంచి పేరు తెచ్చుకోవాలని ప్రోత్సహించేవారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూతురిని బాగా చదివించి ఉన్నతస్థానంలో నిలబెట్టాలనేది ఆయన కోరిక. అంతేకాదు స్వతహాగా బాక్సింగ్ అంటే ఉన్న ఇష్టంతో కూతురిని ఆ శిక్షణ తరగతుల్లో చేర్చాడు. అనిత కూడా తండ్రి ఆశయాన్ని నిలబెట్టాలనుకుంది. వీరిద్దరి కలలూ తీరకుండానే దురదృష్టవశాత్తూ అనారోగ్యానికి గురై చనిపోయాడు తండ్రి. అప్పటికి అనిత వయసు పదమూడేళ్లు. వ్యవసాయంతో నడిచే ఆ కుటుంబం తండ్రి లేకపోవడంతో ఆర్థికంగా చతికిలపడింది. ఈలోగా బంధువులంతా ‘ఇంటి యజమాని లేడు ఆడపిల్ల గుండెలమీద భారం...పెళ్లి చేసి పంపేయ్ అని వాళ్లమ్మ రాజ్‌పతీదేవి చెవిలో పోరు పెట్టడం మొదలుపెట్టారు’. కానీ తల్లి కూతురువైపే నిలబడింది. నువ్వు ధైర్యంగా చదువుకో అనే భరోసా ఇచ్చింది. ‘హరియాణాలో అమ్మాయిలకు బోలెడు ఆంక్షలు. ముఖ్యంగా ఆడపిల్లలకు ఎక్కువ చదువు అనవసరం అనే భావన నాటుకుపోయింది. 15 ఏళ్లలోపు పెళ్లిళ్లు చేసేస్తారు. ఒకవేళ ఆసక్తి ఉండి చదువుకున్నా... అయిదు గంటల్లోపే ఇంటికి చేరుకోవాలి. ఇలా ఒకటేమిటి బోలెడు ఇబ్బందులు ఉండేవి. అయినా సరే! అమ్మ ఈ విషయాల్లో నాకు కొంత వరకూ స్వేచ్ఛనిచ్చింది. బంధువుల విమర్శలను పట్టించుకోవద్దనేది. అనుకున్న లక్ష్యంపైనే ధ్యాస ఉంచు అని భరోసా కల్పించేది’ అని చెబుతోంది అనిత.
ఇంటింటికీ తిరిగి పాలమ్మి...
నాన్న లేకపోవడంతో వాళ్లమ్మపైనే కుటుంబ భారం పడింది. హరియాణా, హిస్సార్‌లో ఈ కుటుంబానికి కొంచెం భూమి ఉంది. అక్కడ వ్యవసాయం మొదలుపెట్టింది. పశువుల్ని పెంచుతూ పాలను ఇంటింటికీ తిరిగి విక్రయించేది. తల్లి కష్టాన్ని అర్థం చేసుకున్న అనిత బడి నుంచి తిరిగి వచ్చి ఇంటి పనుల్లో సాయం చేసేది. సెలవురోజుల్లో వ్యవసాయ పనులు చేసేది. తండ్రి చనిపోవడంతో బాక్సింగ్ వదిలేసింది. కానీ స్కూల్లో జరిగే అన్ని క్రీడాపోటీల్లోనూ చురుగ్గా పాల్గొనేది. డిగ్రీ పూర్తయ్యాక కురుక్షేత్ర విశ్వవిద్యాలయంలో పీజీ చేసింది. ఆపై 2014లో హరియాణా పోలీసు శాఖకు ఎంపికై ఇన్‌స్పెక్టరుగా విధుల్లో చేరింది. కుటుంబానికి ఆర్థికంగా చేయూతనిచ్చింది.
రెండేళ్ల క్రితం మొదలుపెట్టి...
పోలీసు శిక్షణలో భాగంగా ఓసారి పర్వతారోహణ చేయాల్సి వచ్చింది. అది ఆమెకు ఎంతగానో నచ్చింది. ఎలాగైనా సరే ప్రపంచంలోని ఏడు ఖండాల్లోని అత్యంత ఎతైన పర్వత శ్రేణుల్ని అధిరోహించాలనే లక్ష్యం పెట్టుకుంది. దాంతో పర్వతారోహకురాలిగా మారింది. హరియాణా పోలీసుశాఖ తమ సిబ్బంది ఆసక్తులను ప్రోత్సహిస్తోంది. దాంతో మౌంటనీరింగ్‌లో శిక్షణ తీసుకోవడానికి అవకాశమూ దొరికింది. అలా రెండేళ్ల క్రితం మొదలుపెట్టిన ప్రయాణంలో గత జనవరిలో దక్షిణ అమెరికాలో అత్యంత ఎత్తైన పర్వతశ్రేణి ఆండీస్ అకాన్‌కాగ్వాను అధిరోహించింది. దీంతో ఏడు ఖండాల్లో ఆరు పర్వతారోహణలను పూర్తిచేసింది. మిగిలిన ఏడవ పర్వతŸశ్రేణి ఎవరెస్టును నేపాల్, చైనా... రెండువైపుల నుంచీ అధిరోహించింది. దీంతో దేశంలోనే ఈ దిశగా ఎవరెస్టుని ఎక్కిన తొలి మహిళా పర్వతారోహకురాలిగా చరిత్రలో నిలిచింది. ఈ సాహసోపేతమైన ప్రయాణం అనితకు ‘టెన్సింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డు’ను దక్కేలా చేసింది. ల్యాండ్ అడ్వెంచర్ కేటగిరిలో ఏటా క్రీడారంగంలో సాహసాన్ని ప్రదర్శించేవారికి ఇచ్చే ఈ అవార్డును తాజాగా రాష్ట్రపతి నుంచి అందుకుంది అనిత.
ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించినప్పుడు నేపాల్ నుంచి ఎక్కడం కన్నా, చైనా వైపు నుంచి చాలా ఇబ్బందులను ఎదుర్కొందీమె. సుదూరంగా ఉండే మంచుకొండలు, తక్కువ ఆక్సిజన్ ఉండటం, రెండు నెలలకు పైగా ఆ మంచుపర్వతాల నడుమ జీవనంతో అనిత చాలా ఇబ్బందులకు గురైంది. మొదటిసారి ఈ పర్వతశిఖరాన్ని చేరడానికి వాతావరణం అనుకూలించక, రెండోసారి మాత్రమే ఈమె దీన్ని సాధించగలిగింది.
ఇదీ చదవండి: ఖాజిపల్లి అర్బన్ ఫారెస్ట్‌ను దత్తత తీసుకున్న ప్రభాస్