నేహాది కర్ణాటకలోని పుత్తూరు. పదో తరగతి చదువుతోంది. 2018లో ‘ఎనెక్స్‌ప్లోరర్స్’లో నిర్వహించిన ఓ వర్క్‌షాప్‌లో ఆమె పాల్గొంది. విద్యార్థుల్లోని ఆవిష్కర్తల్ని ప్రోత్సహించే కార్యక్రమం అది. అక్కడ వక్క రైతుల కష్టాల గురించి ప్రస్తావన వచ్చింది. ‘రసాయనాలు ఎక్కువగా వాడుతుంటారు. ముఖ్యంగా వర్షాకాలంలో ఫంగల్ ఇన్ఫెక్షన్ల నివారణకు బోర్‌డాక్స్ మిశ్రమాన్ని చల్లుతారు. దీన్ని పిచికారీ చేసేటపుడు గుండె పట్టినట్టు, తల తిరుగుతున్నట్టు... ఇతరత్రా అనేక అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ప్రత్యామ్నాయం లేక ప్రాణాంతకమైన ఆ పని చేస్తున్నారని అర్థమైంది. దానికి ఓ పరిష్కారం చూపించాలనుకున్నా’ అంటోంది నేహ. దీనికోసం తల్లిదండ్రులు, పాఠశాల సైన్స్ ల్యాబ్, ఎనెక్స్‌ప్లోరర్స్ సహకారంతో ఓ ఆటోమేటెడ్ మెషీన్ రూపొందించింది.
సంప్రదాయ గాటర్ పంప్‌ని వినియోగించడానికి ముగ్గురు వ్యక్తులు పనిచేయాలి. ఈ క్రమంలో నేరుగా ఆ రసాయనాలకు వారు ప్రభావితం అవుతారు, దీంతోపాటు పిచికారీ సమయంలో కిందపడి చాలా రసాయనం వృథా అవుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని తాను నేర్చుకున్న ఆర్కిమెడిస్ సూత్రం ఆధారంగా ఈ నమూనా యంత్రాన్ని తయారు చేసింది నేహ. దీన్ని సైకిల్ లేదా మోటార్ సైకిల్‌పైన అమర్చితే... ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లొచ్చు కూడా. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే ఐదుగంటల పాటు పనిచేస్తుందిది. ఈ స్ప్రేయర్ యంత్రంతోనే ‘సీఎస్‌ఐఆర్’ జాతీయ స్థాయి పోటీల్లో విజేతగా నిలిచింది నేహా. ప్రస్తుతం సోలార్ పవర్‌తో పనిచేసే మరో మెషీన్ తయారుచేస్తోందీమె.
