జీహెచ్ఎంసీ సహా రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో 2019-20 సంవత్సరానికి ఆస్తిపన్ను బకాయిల చెల్లింపు కోసం... అమలు చేస్తున్న ఓటీఎస్ పథకం గడువును ప్రభుత్వం పొడిగించింది. బకాయిలను 90 శాతం వడ్డీ మినహాయింపుతో చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఓటీఎస్ అవకాశం కల్పించింది.
నెలాఖరు వరకు గడువు పెంచుతూ పురపాలకశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆస్తి పన్ను బకాయిదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని... విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. నెలాఖరులోపు వంద శాతం పన్నుల వసూలే లక్ష్యంగా నిర్ధేశించుకున్న పురపాలకశాఖ... అందుకు ప్రత్యేకాధికారులను నియమించింది.
జీహెచ్ఎంసీ మినహా మిగతా పట్టణాలు, నగరాల్లో ప్రతి సోమ, బుధ, ఆదివారాలతోపాటు.. సెలవు రోజుల్లో పన్నుల వసూలు కోసం ప్రత్యేక మేలాలు నిర్వహించాలని గతంలోనే ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకు వీలుగా తొమ్మిది మంది ప్రత్యేకాధికారులను నియమించారు. ఆస్తిపన్ను, మంచినీటి బిల్లు, వ్యాపార లైసెన్స్లు, ప్రకటనల రుసుములు తక్కువగా వసూలైన పట్టణాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు.
ఇదీ చూడండి : అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టండి: బండి సంజయ్