Telangana Budget 2022: హుందాతనాన్ని కాపాడుకుంటూ బడ్జెట్ సమావేశాల్లో ప్రతి అంశంపైనా సమగ్రంగా చర్చించాలని శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ఆకాంక్షించారు. సోమవారం నుంచి సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో సభాపతి పోచారం, మండలి ప్రొటెం ఛైర్మన్ జాఫ్రీ అధికారులతో సన్నాహక భేటీ నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక, పురపాలకశాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రామకృష్ణారావు, అర్వింద్ కుమార్, ఇతర అధికారులతో సమావేశమై.. సన్నద్ధతను సమీక్షించారు. సమావేశాలు పారదర్శకంగా జరిగేందుకు గత సమావేశాల తరహాలోనే ప్రభుత్వం, అధికారులు సహకరించాలని కోరిన పోచారం.. సభ్యులు అడిగిన సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా అందించాలని చెప్పారు.
గత సమావేశాలకు సంబంధించి పెండింగులో ఉన్న ప్రశ్నలకు జవాబులను వెంటనే పంపించాలని ఆదేశించారు. కొవిడ్ ప్రభావం తగ్గనప్పటికీ ఇంకా పూర్తిగా పోనందున తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. మాస్క్ ధరించాలన్న సభాపతి.. ఎవరికైనా లక్షణాలు ఉంటే నిర్ధరణ చేసేందుకు వైద్య, ఆరోగ్య శాఖ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని తెలిపారు. డీజీపీ మహేందర్ రెడ్డి, పోలీస్ కమిషనర్లు సీవీఆనంద్, స్టీఫెన్ రవీంద్ర, మహేష్ భగవత్ సహా పోలీసు అధికారులతో సమావేశమైన పోచారం, జాఫ్రీ భద్రతా పరమైన అంశాలపై సమీక్షించారు. రాష్ట్ర పోలీసు శాఖ అత్యంత సమర్ధవంతమైనదన్న సభాపతి... లోపల సభ ప్రశాంతంగా జరగాలంటే బయట శాసనసభ పరిసర ప్రాంతాలు కూడా ప్రశాంతంగా ఉండాలని తెలిపారు. సమావేశాలు సజావుగా సాగేందుకు పోలీసు శాఖ తరుపున పూర్తి సహాయ, సహకారం అందించాలని పోచారం కోరారు.
Telangana Budget Details 2022: ఈ నెల 7న బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండగా.. తొలి రోజే పద్దు ప్రవేశపెట్టనున్నారు. సభ ప్రొరోగ్ కానందున ఈసారి గవర్నర్ ప్రసంగం ఉండబోదని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది.
భారీ బడ్జెట్‌కు సిద్ధం..
రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ బడ్జెట్‌కు సిద్ధమైంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్‌ను సోమవారం ఉభయసభల్లో ప్రవేశపెట్టనున్నారు. గత బడ్జెట్, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రాబడులు, జీఎస్డీపీలో వృద్ధి, తదితర అంశాలను పరిగణలోకి తీసుకుంటే మరోసారి భారీ పద్దునే ప్రవేశపెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. షెడ్యూల్ ప్రకారం 2023 ద్వితీయార్థంలో రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరగాల్సి ఉంది. దీంతో ఈ సోమవారం ప్రవేశపెట్టే బడ్జెటే ఎన్నికలకు ముందు పూర్తి స్థాయి బడ్జెట్ కానుంది.
ఈ నేపథ్యంలో బడ్జెట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పద్దు కూర్పు ఎలా ఉంటుందన్న విషయం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా కేటాయింపులు ఉండనున్నాయి. సంక్షేమం, వ్యవసాయ రంగాలకు పెద్దపీట వేస్తూనే హామీల అమలుకు సర్కార్ ప్రాధాన్యం ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అందుకు తగ్గట్టుగా నిధుల కేటాయింపులు ఉండనున్నాయి.
ఇదీ చదవండి: