బడ్జెట్ సమావేశాలకు ఎలాంటి అవాంతరాలు రాకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. సోమవారం నుంచి సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ, పోలీసు ఉన్నతాధికారులతో సభాపతి సమావేశమయ్యారు. శాసనసభ, మండలి నిర్వహణ, శాంతిభద్రతలు, కరోనా నివారణా చర్యలు, సంబంధిత అంశాలపై అధికారులతో చర్చించారు. సమావేశాలకు అందరూ సహకరించాలని కోరిన పోచారం... సభ్యులు స్వేచ్ఛగా పాల్గొనేలా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని చెప్పారు.
విధిగా మాస్క్ ధరించాలి
పెండింగ్‌లో ఉన్న ప్రశ్నలకు త్వరగా సమాధానాలు పంపాలని చెప్పారు. కరోనా పరిస్థితుల దృష్ట్యా నిబంధనలను కొనసాగిస్తున్నట్లు సభాపతి తెలిపారు. అసెంబ్లీ సమావేశ మందిరం, పరిసరాల్లో రోజుకు రెండుసార్లు శానిటైజేషన్ చేస్తారని చెప్పారు. ప్రతి సభ్యుడు, సిబ్బంది తప్పనిసరిగా మాస్కులు ధరించాలన్నారు.
అందరికీ పరీక్షలు...
సభ్యుల ఆరోగ్య రక్షణ కోసం ర్యాపిడ్ పరీక్షలు చేస్తామని చెప్పారు. సిబ్బంది, మీడియా ప్రతినిధులు, మార్షల్స్ పరీక్షలు చేయించుకోవాలన్న పోచారం... ఎవరికైనా పాజిటివ్ అని తేలితే అసెంబ్లీ ఆవరణలోకి రాకూడదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, మండలి డిప్యూటీ ఛైర్మన్ నేతివిద్యాసాగర్, చీఫ్ విప్ వెంకటేశ్వర్లు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: కేటీఆర్‌ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ