స్వరాలు, సంస్కారాల బాటలో నడిచిన గొప్ప గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. హాసం సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్ పీఎస్ గోపాలకృష్ణ రచించిన ఎస్పీ బాలసుబ్రమణ్యం ‘జీవనగానం’ గ్రంథావిష్కరణ, 55 నిమిషాల నిడివితో సంజయ్ కిషోర్ రూపొందించిన ‘బాలు జీవన చిత్రం’ డాక్యుమెంటరీని శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని దస్‌పల్లా హోటల్‌లో ఆయన ఆవిష్కరించారు. ప్రముఖ సినీనటుడు కమల్‌హాసన్, శాంత బయోటెక్ వ్యవస్థాపకులు డాక్టర్ వరప్రసాద్‌రెడ్డి పాల్గొని బాలుతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
‘‘బాలు పాట సజీవ గానం. సంగీత చరిత్రలో ఆయన పాత్ర చిరస్మరణీయం. తన మాతృభాషే సంగీతమని గొప్పగా చెప్పుకొన్న వ్యక్తి. ఎంతో సంస్కారవంతుడు. స్నేహశీలి. దేశం గర్వించదగ్గ ఒక గొప్ప నిధి. నేటితరం ఆయన గురించి లోతుగా తెలుసుకోవాలి. ముందు తరాలూ తెలుసుకోవాల్సిన స్వరకారుడు. తెల్లవారుజామున త్యాగరాజు కీర్తనలతో పాటు ఘంటశాల, బాలు పాటలతోనే నా ప్రతిరోజు ప్రారంభమవుతుంది. పాటకు ఘంటశాల, ఎస్‌పీబీ రెండు కళ్లలా నిలిచారు. సినిమా రంగం చాలా శక్తిమంతమైనది. మంచి సందేశంతో కూడిన చిత్రాలు ఎంతో అవసరం. తెలుగు ప్రజల జీవితాల్లో బాలు చిరస్మరణీయులు’’అని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.
జీవనగానం తొలి ప్రతిని కమల్‌హాసన్‌కు వెంకయ్యనాయుడు అందించారు. తాను, బాలు శరీరాలుగా వేరైనా.. ఆత్మగా ఒకటేనని ప్రముఖ సినీనటుడు కమల్‌హాసన్ అన్నారు. ఆయన నుంచి సహృదయతను నేర్చుకున్నానన్నారు. ఈ సందర్భంగా హాసం సంస్థ స్థాపకులు, శాంత బయోటెక్ వ్యవస్థాపకులు డాక్టర్ వరప్రసాద్‌రెడ్డి ఈ పుస్తకాన్ని ఆంగ్ల, తమిళ భాషల్లోనూ అందిస్తామని చెప్పారు. పుస్తక రచయిత డాక్టర్ పీఎస్ గోపాలకృష్ణ తనకు బాలుతో 50 ఏళ్ల అనుబంధం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, సినీ దర్శకుడు రాఘవేంద్రరావు, ఎస్పీ శైలజ, ఎస్పీ చరణ్, శుభలేఖ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఎంతో మందిని సంగీత కళాకారులుగా తీర్చిదిద్దింది: ఎస్పీ బాలసుబ్రమణ్యం ఎన్నో పాటలు పాడినా, కార్యక్రమాలు చేసినా రామోజీరావు సహకారంతో ఈటీవీలో నిర్వహించిన ‘పాడుతా తీయగా’ తనకు ఎంతగానో నచ్చిన, మెచ్చిన కార్యక్రమం అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఇది వందలమంది కళాకారులను సంగీతకారులుగా తీర్చిదిద్దిందన్నారు. సంగీతాన్ని నేర్పించడంతో పాటు యువ కళాకారుల తప్పులను సరిదిద్దిందని తెలిపారు. మన మాట, పాట, ఆట, బాట యాస, గోసను కూడా ఈ కార్యక్రమం ప్రతిబింబించిందని చెప్పారు.
ఎస్పీ బాలు అంటే తెలుగు పాటకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన పాటకారి. తెలుగు భాష సంస్కృతులను ముందుతరాలకు చేరవేసిన మాటకారి. తన వృత్తి పట్ల నిబద్ధతతో పాటు వారి వినయం, ఉత్సాహం ఇవి రెండు వారి ప్రతిభకు ఎంతో వన్నె తెచ్చాయి. సంగీత అభిమానులను ప్రోత్సహించారు. వందలమంది కళాకారులను సంగీతకారులుగా తీర్చిదిద్దారు. సంగీతాన్ని నేర్పించడంతో పాటు యువ కళాకారుల తప్పులను సరిదిద్దారు. మన మాట, పాట, ఆట, బాట యాస, భాష ప్రతిబింబించే సంస్కృతిని వారందరికి అందించారు. - వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి
"తాను, బాలు శరీరాలు వేరైనా ఆత్మగా ఒకటే. ఆయన నుంచి సహృదయతను నేర్చుకున్నాను." - కమల్‌హాసన్ ప్రముఖ సినీనటుడు
ఇదీ చదవండి: 'మరో రెండు రోజుల తర్వాతే తెలంగాణలోకి నైరుతి'