Weather Report: నైరుతి రుతుపవనాలు సోమవారం అండమాన్, నికోబార్ దీవుల వద్ద బంగాళాఖాతంలోకి ప్రవేశించాయి. రెండు మూడు రోజుల్లో దక్షిణ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, అండమాన్ సముద్రం ప్రాంతాల్లో మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణశాఖ తెలిపింది. ఈ నెలాఖరుకు కేరళ తీరానికి, వచ్చే నెల 8 నాటికి తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని అంచనా వేసింది. రాష్ట్రంలో మంగళ, బుధవారాల్లో అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ రాష్ట్ర సంచాలకురాలు నాగరత్న తెలిపారు. వర్షం కురిసే సమయంలో కొన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఆదివారం రాత్రి 8 నుంచి సోమవారం రాత్రి 8 గంటల వరకూ రాష్ట్రంలో పలుచోట్ల విస్తారంగా వర్షాలు కురిశాయి. అత్యధికంగా కామారెడ్డి జిల్లా తాడ్వాయిలో 9.9 సెంటీమీటర్లు, బీబీపేటలో 8.8, రామలక్ష్మణపల్లిలో 7, గాంధారిలో 7, నాగిరెడ్డిపేటలో 6.4, బిచ్కుందలో 6.4, చిన్నశంకరంపేట (మెదక్ జిల్లా)లో 8.2, పైడ (నిజామాబాద్)లో 6.9 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇంకా పలు ప్రాంతాల్లో ఇంతకన్నా తక్కువస్థాయిలో వాన కురిసింది. వేసవిలో ఇలా అకస్మాత్తుగా క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి భారీ వర్షాలు పడటం సాధారణమేనని వాతావరణశాఖ తెలిపింది.
సోమవారం రాష్ట్రంలోకెల్లా అత్యధికంగా మణుగూరు(భద్రాద్రి జిల్లా)లో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని శాంతినగర్‌కాలనీకి చెందిన రేణుకుంట్ల వీరమ్మ (58), మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం నర్సింహులగూడేనికి చెందిన ఎం.సోల్తా(55) వడదెబ్బకు గురై సోమవారం మృతి చెందారు.
ఇవీ చదవండి: