భారత సమాజం అపూర్వమైన పరివర్తన దిశగా ముందుకు సాగుతోందని రామకృష్ణమఠం వివేకానంద ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్ హైదరాబాద్ డైరెక్టర్ స్వామి బోధామయానంద అన్నారు. జాగృత భారతం- సంపన్న భారతం నినాదంతో దక్షిణ మధ్య రైల్వే రైల్ నిలయం నుంచి నిర్వహించిన నిఘా అవగాహన వెబినార్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రతీ రంగాన్ని కొవిడ్- 19 తీవ్రంగా ప్రభావితం చేసిందని... ఇది పని సంస్కృతిని మార్చివేసిందని పేర్కొన్నారు.
ఫలవంతం చేసుకోవాలి
విలువలతో కూడిన భారతీయ వ్యవస్థ నిజాయితీపై దాని ప్రభావాన్ని అనే అంశంపై ఆయన ప్రసంగించారు. మంచి విషయాలను వినాలి, మంచిని గురించి మాట్లాడాలని, ఉపయోగకరమైన విషయాలను ఆచరించి మన జీవితాలను ఫలవంతంగా, అర్థవంతంగా మార్చుకోవాలని ఆయన సూచించారు.
సంస్థాగత మార్పు అవసరం
అవినీతి నిర్మూలనకు చేపట్టాల్సిన చర్యలపై లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ ప్రసంగించారు. ఉత్పాదకతకు విఘాతంగా అవినీతి పరిణమిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. సమాజంలో సంస్థాగత వ్యవస్థ అవసరమని అభిప్రాయపడ్డారు. అవినీతి పెరుగుతోందని ఒక భావనగా ఉందని, కానీ వాస్తవంగా చూస్తే అది తగ్గుముఖం పడుతోందన్నారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందించే దిశగా, సంస్కరణలను అమలుపరిచేందుకు ద.మ. రైల్వే సాంకేతిక పరిజ్ఞాన వినియోగాన్ని ఆయన ప్రశంసించారు.
అవగాహన
అవినీతిని నిర్మూలించే దిశగా వారోత్సవాలను జరుపుకోవడం ద్వారా సిబ్బందిలో అవగాహనను పెంపొందించవచ్చునని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా పేర్కొన్నారు. ఆ దిశగా ద.మ.రైల్వే ఈ- ఆఫీస్, ఈ- టెండరింగ్ వంటి సంస్కరణలను అమలు చేయడంలో మొదటి వరుసలో ఉందని వెల్లడించారు.
ఇదీ చదవండి: ఉదయం 11 గంటలకు కృత్రిమ మేధ - విద్య, ఉద్యోగావకాశాలపై వెబినార్