దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లో ఉన్న ప్రస్తుత పరిస్థితిలో ప్రయాణికుల రైళ్లను నిత్యావసరాల రవాణాకు రైల్వేశాఖ వినియోగించనుంది. 32 ప్రత్యేక పార్సిల్ రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. వీటిలో ప్రయాణికుల్ని అనుమతించబోమని స్పష్టం చేసింది.
ఏప్రిల్ 8 నుంచి 14 వరకు కాకినాడ టౌన్ నుంచి సికింద్రాబాద్కు రోజూ ఒక్కో పార్సిల్ రైలు నడుస్తుంది. రేణిగుంట-సికింద్రాబాద్ రైలు నాలుగు రోజులు.. రేణిగుంట-నిజాముద్దీన్ మధ్య పాల సరఫరాకు రెండు ప్రత్యేక రైళ్లు, సికింద్రాబాద్-హౌరా, హైదరాబాద్- అమృత్‌సర్ మధ్య ఒక్కో పార్సిల్ రైలు నడపనున్నట్లు తెలిపింది.
ఇవాళ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి రెండు బోగీలలో సరుకును తీసుకుని రేణిగుంటకు రైలు బయలుదేరి వెళ్లింది. ఇది రేపు ఉదయం చేరుకుంటుంది. కాకినాడ నుంచి బయలుదేరిన సరకు రవాణా రైలు సికింద్రాబాద్ చేరుకుంది.
రవాణా చేయాలనుకునే కంపెనీలు, ఆసక్తి గల బృందాలు, స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు రైల్వే సేవల్ని ఉపయోగించుకోవచ్చని ద.మ. రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ తెలిపారు. ఇందుకోసం సికింద్రాబాద్‌లోని జోనల్ సెంట్రల్ కంట్రోల్ రూం నంబర్లు 97013 70083, 97013 70958 ను సంప్రదించాలని సూచించారు.
ఇదీ చూడండి: కరోనా మానసిక ఆందోళనను ఇలా జయించండి