వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఇంజినీర్ల పాత్ర కీలకమని నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్‌కుమార్ అన్నారు. హైదరాబాద్ ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్‌లో ది అసోసియేషన్ ఆఫ్ ఇంజినీర్స్ సంస్థ ఆధ్వర్యంలో రైతుల ఆదాయాల రెట్టింపులో ఇంజినీర్ల పాత్రపై జరిగిన రాష్ట్ర స్థాయి సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇంజినీర్లు అంకుర కేంద్రాల స్థాపనకు ముందుకు వస్తే రైతుల ఆదాయాలు రెట్టింపు చేయడం సాధ్యమేనని సోమేశ్‌కుమార్ అన్నారు. ప్రపంచంలో ఐఓటీ - సాంకేతిక పరిజ్ఞానం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో వ్యవసాయ నమూనాలు, కృత్రిమ మేధస్సు, సెన్సర్, డ్రోన్ టెక్నాలజీ అందిపుచ్చుకుని ముందుకు వెళ్లాలని సూచించారు.
రాష్ట్రం నలుమూలల నుంచి వ్యవసాయ, నీటి పారుదల ఇంజినీరింగ్ నిపుణులు, పట్టభద్రులు ఈ సదస్సులో పాల్గొన్నారు. వ్యవసాయ రంగ సంక్షోభం, రైతుల ఆత్మహత్యల పరంపర నుంచి అధిగమించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు. పంటల సాగులో పెట్టుబడులు తగ్గించడం ద్వారా ఉత్పత్తి, ఉత్పాదకతల పెంపులో వ్యవసాయ, నీటిపారుదల ఇంజినీర్ల పాత్రపై విస్తృతంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ వెల్చాల ప్రవీణ్‌రావు, వాలంతరి డైరెక్టర్ డాక్టర్ భట్టు కృష్ణారావు, తెలంగాణ రాష్ట్ర విశ్రాంత ఇంజినీర్ల సంఘం ప్రధాన కార్యదర్శి శ్యాంసుందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: నైరుతి రుతుపవనాలు వచ్చే వరకు ఇంతే!