కొద్ది రోజుల కిందట గోదావరి నది నుంచి నగరానికి నీటిని తెచ్చే మల్కాపురం పంప్ హౌస్ వరద నీటిలో మునిగిపోయింది. దీంతో నగరానికి నీటి సరఫరా ఆగిపోయింది. ఇదే విధంగా కృష్ణా నుంచి వచ్చే తాగునీటికి అడ్డంకి ఏర్పడితే కూడా ఇలానే సగం ఏరియాలకు తాగునీటి సరఫరా నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీన్ని అధిగమించడానికి కృష్ణా, గోదావరి, మంజీర తదితర నదుల నుంచి వచ్చే తాగునీటి లైన్లన్నింటిని కలిపి మహావలయంగా ఏర్పాటు చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు(Solution for the drinking water crisis in Hyderabad). దీన్ని రింగ్‌మెయిన్ ప్రాజెక్టుగా అధికారులు వ్యవహరిస్తున్నారు(Ring main project). దశలవారీగా ఈ ప్రాజెక్టును పూర్తి చేసి భవిష్యత్తులో మహానగరంలోని అన్ని ప్రాంతాలకు రోజువారీ నీళ్లు ఇవ్వాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్(minister ktr) ఆలోచన చేస్తున్నారు. వచ్చే రాష్ట్ర బడ్జెట్‌లో దీనికి మరిన్ని నిధులు కేటాయించే అవకాశం ఉందని ఆర్థికశాఖ వర్గాలు తెలిపాయి(funds allocation in next budget).
ఎందుకీ ఈ ప్రాజెక్టు
రాజధాని వాసుల కోసం రోజూ జలమండలి 460 మిలియన్ గ్యాలన్లు నీటిని సరఫరా చేస్తోంది. కృష్ణా, గోదావరి, మంజీరా నదులతోపాటు జంట జలాశయాల నుంచి రోజూ నీటిని నగర వాసులకు సరఫరా చేస్తున్నారు. గోదావరి నీళ్లు కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, మాదాపూర్‌తోపాటు ఐటీ కారిడార్‌కు వెళ్తాయి. ఇలా కృష్ణా, మంజీరా, జంటజలాశయాల నీరు నగరంలోని వేర్వేరు ప్రాంతాలకు వెళ్తున్నాయి. నాలుగు తాగునీటి పైపులైన్ల అనుసంధానం ఇంతవరకు జరగలేదు. దీంతో గోదావరి నీటి పంపింగ్‌లో సమస్య ఏర్పడితే సంబంధిత ప్రాంతాలకు సరఫరా ఆగిపోతోంది. అన్ని పైపులైన్లది ఇదే సమస్య. నానాటికీ విస్తరిస్తున్న నగరానికి 24 గంటలూ నీటిని సరఫరా చేయాలంటే గోదావరి, కృష్ణా, మంజీరా, జంటజలాశయాల నీటి పైపులైన్లను అనుసంధానం చేయాలి. దీంతో ఎక్కడైనా పంపింగ్‌లో సమస్య ఏర్పడినా ఏ ప్రాంతానికి నీటి సరఫరాలో ఇబ్బంది లేకుండా చూడాలన్నది సర్కార్ నిర్ణయం. భవిష్యత్తులో రోజు వారీ నీటి సరఫరా చేయాలన్న ఆలోచనలో సర్కార్ ఉంది. ఈ నేపథ్యంలో రింగ్ మెయిన్ ప్రాజెక్టుకు సర్కార్ కొద్ది నెలల కిందట శ్రీకారం చుట్టింది.
ప్రాజెక్టు ఎలా చేపడతారు!
158 కి.మీ. పొడవున ఉన్న బాహ్యవలయ రహదారి(అవుటర్ రింగ్ రోడ్డు)చుట్టూ 3000 మి.మి. వ్యాసార్థంతో కొత్తగా భారీ పైపులైను నిర్మిస్తారు. నదులు, జంటజలాశయాల నుంచి వచ్చే పైపులైనుతోపాటు రిజర్వాయర్లు అనుసంధానం చేస్తారు. త్వరలో నిర్మిస్తున్న కేశ్వాపురం, దేవులమ్మనాగారం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల సైతం ఈ లైన్‌కు కలుపుతారు. ఓఆర్‌ఆర్ చుట్టూ 18 చోట్ల రేడియల్ రోడ్లు ఉన్నాయి. ప్రాజెక్టుకు అనుసంధానంగా రేడియల్ రోడ్ల వెంబడి 98 కి.మీ. మేర రేడియల్ మెయిన్స్ నిర్మించనున్నారు. ఇక్కడా పైపులైన్లు నిర్మించి మిగతా ప్రాంతాలకు నీటిని సరఫరా చేస్తారు. రింగ్‌మెయిన్ చుట్టూ 110 మిలియన్ లీటర్ల సామర్థ్యంతో 12 రిజర్వాయర్లు నిర్మించనున్నారు. అత్యవసర పరిస్థితిలో ఏదైనా కారణంతో నగరానికి నీటి సరఫరా ఆగిపోతే ఈ రిజర్వాయర్ల నుంచి నీటిని తరలించడానికి అవకాశం ఉంది. దీనివల్ల, ప్రస్తుత ప్రాంతాలతోపాటు కొత్తగా పైపులైన్లు విస్తరించే ప్రాంతాలకు సులువుగా నీటిని ఇవ్వొచ్చని చెబుతున్నారు.
పనుల వారీగా ఖర్చు
- వ్యయం: రూ.4765 కోట్లు
- 158 కిమీ పైపులైను నిర్మాణానికి అయ్యే వ్యయం రూ. 3965 కోట్లు
- రేడియల్ రోడ్ల వెంబడి 98 కిమీ పైపులైను నిర్మాణానికి రూ. 550 కోట్లు
- 12 రిజర్వాయర్లకు రూ. 250 కోట్లు
నగరానికి ఎంతో కీలకం
మహానగరానికి రింగ్‌మెయిన్ ప్రాజెక్టు ఎంతో కీలకమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ పట్టుదల వల్ల నగర ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నీటిని సరఫరా చేయగలుగుతున్నాం. రూ.వేల కోట్లతో కేశ్వాపూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులు మొదలయ్యాయి. రింగ్‌మెయిన్ ప్రాజెక్టు పూర్తయితే నగరానికి అంతరాయం లేకుండా నీటిని సరఫరా చేయొచ్ఛు సర్కార్ కేటాయించిన నిధులతో మొదటి పనులు దాదాపుగా పూర్తి చేశాం. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా మిగిలిన పనులనూ చేపడతాం. - దానకిశోర్, జలమండలి ఎండీ
ఇప్పటికే 46 కి.మీ. పూర్తి
మొదటి దశ ప్రాజెక్టు కోసం రూ.285 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. ఈ నిధులతో జలమండలి అధికారులు కండ్ల కోయ నుంచి ముత్తంగి వరకు 30 కిలో మీటర్ల పైపులైను నిర్మాణాన్ని పూర్తి చేశారు. ముత్తంగి నుంచి కోకాపేట వరకు 18 కి.మీ నిర్మించాల్సి ఉండగా 16 కి.మీ పూర్తయింది. సర్కార్ మిగిలిన నిధులను కేటాయిస్తే దశలవారీగా పనులు చేపట్టడానికి అధికారులు ప్రణాళికలు రూపొందించారు.
ఇదీ చూడండి: కేంద్ర జలశక్తి అవార్డు తుది జాబితాలో తెలంగాణకు చోటు