రాష్ట్రంలో మంగళవారం మరో ఆరుగురిలో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ కేసులన్నీ కూడా హైదరాబాద్(జీహెచ్‌ఎంసీ) పరిధిలోనే నమోదయ్యాయి. మొత్తంగా కరోనా బాధితుల సంఖ్య 1009కి పెరిగింది. వైరస్ బారిన పడినవారిలో మరో 42 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి అయ్యారు. ఇప్పటి వరకు 374 మంది ఆరోగ్యవంతులుగా ఇళ్లకెళ్లారు. ప్రస్తుతం గాంధీ, ఛాతీ, కింగ్‌కోఠి ఆసుపత్రుల్లో కలుపుకొని 610 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు మహమ్మారి బారినపడి 25 మంది మృతిచెందారు.
మొత్తం రాష్ట్రంలో ఇప్పుడున్న పాజిటివ్ కేసులు 50 శాతం జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఉన్నాయి. జీహెచ్‌ఎంసీలో 30 సర్కిళ్లుంటే వాటిల్లో 8 సర్కిళ్లలోనే 70 శాతం కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత వికారాబాద్, గద్వాల, సూర్యాపేట జిల్లాల్లో నమోదయ్యాయి.
నిజామాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో కేసులున్నా వాళ్లు డిశ్ఛార్జి అయ్యారు. నిర్మల్‌లో ఉన్నప్పటికీ కొందరు డిశ్ఛార్జి అయ్యారని, ఒకటీ, రెండు కేసులున్న జిల్లాలను క్లస్టర్‌గా గుర్తించలేం కాబట్టి సమీక్షించి 22 జిల్లాలను డేంజర్ జోన్‌లో లేని జిల్లాలుగా నిర్ణయించినట్లు మంత్రి ఈటల తెలిపారు. మంగళవారం కోఠిలోని ఆరోగ్య కార్యాలయంలో ఉన్నతాధికారులతో కలిసి మంత్రి మాట్లాడారు.
తెలంగాణలో 19 వేల పరీక్షలు
భారత్‌లో 29,434 మందికి పాజిటివ్ వస్తే 934 మరణాలు సంభవించాయని అది 3.2 శాతమని, తెలంగాణలో 1009 పాజిటివ్ కేసులకు 2.5శాతం మాత్రమే మరణించారన్నారు. దేశంలో 7,16,733 పరీక్షలు నిర్వహిస్తే 4.1 శాతం పాజిటివ్ వచ్చాయని, తెలంగాణలో 19,063 నమూనాలను పరీక్షిస్తే 5.3 శాతం పాజిటివ్ వచ్చాయన్నారు. 5 కేసుల కంటే తక్కువ ఉన్న ప్రాంతాలను కంటైన్మెంట్ చేయకూడదని ఐసీఎంఆర్ చెప్పిందని, ఇకపై దీన్ని అనుసరిస్తామని మంత్రి చెప్పారు.
రాష్ట్రానికి ప్రస్తుతం రోజుకు 1540 టెస్టులు చేసే సామర్థ్యం ఉందని, మరో 3500 నుంచి 5000 పరీక్షలు చేయడానికి సామర్థ్యమున్న పరికరాన్ని త్వరలో కొనుగోలు చేయనున్నట్లు ఈటల తెలిపారు. భవిష్యత్తులో దురదృష్టవశాత్తు మళ్లీ కరోనా విజృంభించినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్లాస్మా థెరపీకి అనుమతి వచ్చిందని, త్వరలోనే దాని విధివిధానాలు ఖరారు చేస్తామని ఆయన చెప్పారు.
మే 8 వరకు కోలుకునే అవకాశం
వచ్చే నెల 7వ తేదీ వరకు లాక్‌డౌన్ తప్పకుండా అమలు చేయాలని, ఎక్కడ కూడా వెనక్కి తగ్గకూడదని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. 8వ తేదీ వరకు రాష్ట్రం కరోనా నుంచి పూర్తిగా కోలుకుంటుందని ఈటల ఆశాభావం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కరోనా మరణాలు, పాజిటివ్ కేసుల వివరాలను దాచిపెట్టేది లేదన్నారు.
గడిచిన 6 రోజులుగా రాష్ట్రంలో పాజిటివ్ కేసుల నమోదు తగ్గడాన్ని చూసి ముఖ్యమంత్రి కేసీఆర్ శుభసూచకం అంటే దాన్ని జీర్జించుకోలేని కొందరు రాష్ట్ర ప్రభుత్వం తేలిగ్గా తీసుకుందని, సరైన సమాచారం ఇవ్వడం లేదని విష ప్రచారం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు.
ఇదీ చదవండి: మే 8 వరకు పూర్తి స్థాయిలో కోలుకుంటాం : మంత్రి ఈటల