SIT investigation in TSPSC paper leak case: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయంలోని అన్ని విషయాలను సిట్ అధికారులు క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. అవసరమైతే సంబంధిత అధికారులను ప్రశ్నించాలని భావిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా చేసినా, యాదృశ్చికంగా జరిగినా తప్పు జరిగింది కాబట్టి దానికి కారణమైన ప్రతి ఒక్కర్నీ ప్రశ్నించాల్సిందే అని సిట్ అధికారులు భావిస్తున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన ఈ రోజుల్లో.. ప్రశ్నాపత్రాలు బయటకు లీక్ కాకుండా అనేక చర్యలు తీసుకోవాలి. కానీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయంలో ఇలాంటివేవీ కనిపించ లేదని దర్యాప్తులో తేలింది.
ఉన్న వ్యవస్థలను కూడా రాజశేఖర్‌రెడ్డి, ప్రవీణ్ నిర్వీర్యం చేసినా ఎవరు కూడా ప్రశ్నించలేదు. ప్రశ్నాపత్రాలను కాన్ఫిడెన్షియల్ సెక్షన్‌లోని కంప్యూటర్లో భద్రపరుస్తారు. సెక్షన్ ఇన్ఛార్జీ తప్ప ఇతరులు తెరిచే అవకాశం లేకుండా డిజిటల్ లాక్ వేస్తారు. ఒకవేళ ఎవరైనా తెరవాలని ప్రయత్నిస్తే వెంటనే సంబంధిత ఇంఛార్జీకి ఎస్ఎమ్ఎస్ అలర్ట్ వస్తుంది.
TSPSC SIT inquiry: ఇక్కడ కూడా ఈ విధానం ఉందని, కానీ ప్రశ్నాపత్రాలపై కన్నేసిన రాజశేఖర్‌రెడ్డి ద్వయం.. దాదాపు సంవత్సరం క్రితం నెట్‌వర్క్ అప్‌డేషన్ జరిగినప్పుడే ఈ అలర్ట్ విధానం నిర్వీర్యం చేసినట్లు సమాచారం. డైనమిక్ ఐపీని స్టాటిక్ ఐపీగా మార్చారు. కానీ నెలలు గడిచినా ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యే వరకూ దీన్ని కమిషన్ కార్యాలయంలో ఎవరూ గుర్తించలేకపోవడం గమనార్హం.
దొంగ చేతికే తాళాలు ఇచ్చారు: టీఎస్‌పీఎస్సీ పరీక్షల నిర్వహణ అనేక అంచెల్లో ఉంటుంది. దీనిపై అజమాయిషీ కూడా అనేక మంది చేతుల్లో ఉంటుంది. కానీ సాంకేతికంగా జరిగిన మార్పులు, రాజశేఖర్ రెడ్డి కదలికలను ఎవరూ అనుమానించకపోవడం అతిపెద్ద తప్పిదంగా సిట్ అధికారులు భావిస్తున్నారు. పైగా ఎవరో బయట నుంచి ఫిర్యాదు చేస్తే తప్ప ప్రశ్నపత్రాలు లీక్ అయినట్లు తెలుసుకోలేకపోయారు. ప్రవీణ్ స్వయంగా గ్రూప్-1 ప్రిలిమ్స్ రాసేందుకు అనుమతి పొందాడు. దొంగ చేతికే తాళాలు ఇచ్చినట్లు పరీక్ష రాస్తున్న ప్రవీణ్‌ను అదే పరీక్ష నిర్వహిస్తున్న కార్యాలయంలో తిరిగేందుకు అనుమతించారు. ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ఇది మరో పెద్ద వైఫల్యంగా సిట్ అధికారులు భావిస్తున్నారు.
పైఅధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమైనప్పటికీ.. సిట్‌కు వారు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రశ్నాపత్రం అత్యంత కఠినంగా వచ్చింది. పరీక్ష తర్వాత అభ్యర్థులు అనేక మంది దీనిపై ఆందోళన కూడా వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి సిద్దమవుతున్న వారికీ 100 మార్కులు దాటడం గగనమైంది. అలాంటిది సెలవు పెట్టకుండా, పెద్దగా పరీక్షకు సిద్ధమవకుండా, కమిషన్ కార్యాలయంలో విధులు నిర్వహించుకుంటూ పరీక్ష రాసిన ప్రవీణ్‌కు 103 మార్కులు వచ్చాయి. అయినప్పటికీ అధికారులు ఎవరికీ అనుమానం రాకపోవడం గమనించాల్సిన విషయం.
అధికారులను ప్రశ్నించే యోచనలో సిట్: దీన్ని సిట్ అధికారులు ఎత్తిచూపుతున్నారు. ప్రశ్నాపత్రాలు తయారు చేయడం నుంచి వాటిని భద్రంగా నిల్వచేయడం, పరీక్షలు నిర్వహించడంలో సంబంధం ఉన్న వారందర్నీ సిట్ ప్రశ్నించనుంది. కమిషన్ కార్యాలయంలో ఉన్న కంప్యూటర్ వ్యవస్థ మరింత ఘోరంగా ఉందని, కొద్దిగా ప్రయత్నిస్తే నెట్‌వర్క్‌లోకి చొరబడటం పెద్ద సమస్య కాదని, దాంతో పాటు ఇక్కడ పని చేస్తున్న ఎవరికీ సాంకేతిక అంశాలపై సరైన పరిజ్ఞానం లేదని సిట్ అధికారులు గుర్తించినట్లు సమాచారం.
Evidence in TSPSC paper leak case: కంప్యూటర్ కార్యకలాపాలకు సంబంధించి ప్రతి చిన్న విషయానికీ రాజశేఖర్‌రెడ్డిపై ఆధారపడాల్సి వచ్చేదని, ఇది కూడా పెద్ద తప్పిదమని అధికారులు భావిస్తున్నారు. ఇన్ని లోపాలు ఉండబట్టే రాజశేఖర్‌రెడ్డి, ప్రవీణ్‌లకు ఆశ పుట్టిందని, తమ పథకం అమలు చేసి విజయవంతంగా ప్రశ్నాపత్రాలు కొల్లగొట్టారని తెలుస్తోంది. ప్రశ్నాపత్రం అమ్ముకోవడంలో తేడా వచ్చి, పోలీసులకు ఫిర్యాదు వచ్చి ఉండకపోతే అసలు ఈ వ్యవహారమే బయటపడేది కాదని, భవిష్యత్తులో జరిగే పరీక్షల ప్రశ్నాపత్రాలు కూడా ఇలానే కొల్లగొట్టే వారని అధికారులు భావిస్తున్నారు.
ఇవీ చదవండి:
ప్రశ్నపత్రాల లీకేజీ కేసు... కీలక సమాచారం సేకరించిన సిట్!
పేపర్ లీకేజీ కేసు స్టేటస్ రిపోర్ట్ సమర్పించండి... ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం